ఓటమి అంటే భయం
వైఫల్యాలు తనను విపరీతంగా భయపెడుతాయని చెబుతోంది ప్రియాంకా చోప్రా. అమెరికాలోని ఫ్లోరిడాలో నిర్వహిస్తున్న భారత అంతర్జాతీయ సినిమా సంస్థ (ఐఐ ఎఫ్‌ఏ) ఉత్సవంలో మాట్లాడుతూ ఈ విషయం చెప్పింది. సాత్ ఖూన్ మాఫ్, బర్ఫీ, ఫ్యాషన్ సినిమాల్లో చక్కటి నటన ప్రదర్శించిన ఈ బ్యూటీ జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకోవడం తెలిసిందే. ‘ఓటమి అంటే నాకు భయమే. నన్ను ముందుకు నడిపించేవీ అవే! ఏదైనా సినిమా హిట్ కాకుంటే చాలా బాధేస్తుంది. గదిలో ఒక్క దానినే రెండు వారాలపాటు గడుపుతాను. బర్ఫీ వల్ల ఉపయోగం ఏమీ ఉండబోదని, ఆ సినిమా చేయొద్దంటూ చాలా మంది భయపెట్టారు. అయినా నేను పట్టించుకోకుండా సంతకం పెట్టేశాను.
ఆ సినిమాలో నా పాత్రకు వచ్చిన స్పందనకు ఎంతో సంతోషించాను’ అని వివరించింది. బాలీవుడ్‌లో తన ప్రయాణం ఎలా మొదలయిందో కూడా ప్రియాంక ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. సినిమా నేపథ్యం లేని ప్రియాంక 17 ఏళ్ల వయసులోనే మిస్ వరల్డ్‌గా ఎంపిక కావడంతో వెండితెరపైకి వచ్చింది. ‘భారతీయ సినిమాల్లో హీరోయిన్లకు సత్తా ప్రదర్శించే అవకాశాలు చాలా తక్కువ. నా వరకైతే నేను అదృష్టవంతురాలిని. ఇప్పటి వరకు చేసిన పాత్రలన్నీ మంచి పేరు తెచ్చిపెట్టాయి. నాకు సినిమాలకంటే ప్రదర్శనలు అంటే ఇష్టం. ఫ్యాషన్ షోల్లో ప్రేక్షకుల నుంచి వెంటనే గుర్తింపు వస్తుంది.’
అని చెప్పిన ప్రియాంక, ఫ్యాషన్‌లో అత్యద్భుత నటనకుగాను జాతీయ అవార్డు దక్కించుకుంది. ‘నాకు అవార్డు వచ్చిందంటూ ఆ రోజు ఉదయం నాలుగింటికి ఫోన్ వచ్చింది. కాసేపటికే ఇంటర్వ్యూల గోల మొదలయింది. నాకైతే కలా..నిజమా అనిపించింది. జాతీయ అవార్డు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నా తల్లిదండ్రులు కూడా అప్పుడు నాతోనే ఉన్నారు. ఎంతో సంతోషంగా అనిపించింది’ అని ప్రియాంకా వివరించింది.