ప్రియాంక చోప్రా డిజిటల్ ప్రయోగం
హాలీవుడ్ టీవీ సీరీస్ 'క్వాంటికో'తో అంతర్జాతీయ స్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. ఈ సిరీస్తో హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వటంతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులను సొంతం చేసుకుంది. ఇదే జోష్లో సొంత గడ్డ మీద కూడా సత్తా చాటడానికి రెడీ అవుతోంది. 'క్వాంటికో' స్పూర్తితో ఇండియాలో కూడా ఓ సీరియల్ను నిర్మించాలని భావిస్తోంది ప్రియాంక చోప్రా.
ఇటీవల పర్పల్ పెబల్ పిక్చర్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన ప్రియాంక చోప్రా, ఆ బ్యానర్లో మూడు ప్రాంతీయ చిత్రాలు ప్రారంభించింది. బోజ్పురిలో భమ్ భమ్ బోల్ రహామై, మరాఠిలో వెంటిలేటర్, పంజాబీలో ఓంకార్ సినిమాలను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటోంది. ఈ సినిమాలతో పాటు 'ఇట్స్ మై సిటీ' పేరుతో ఓ సీరియల్ను కూడా ప్రారంభిస్తోంది.
అయితే ఈ సీరియల్ను ఏ టీవీ ఛానల్లో ప్రసారం చేయకుండా నేరుగా ప్రేక్షకులు డిజిటల్ టెక్నాలజీ సాయంతో మొబైల్ ఫోన్లో చూసుకునే వీలు కల్పించడానికి ప్రయత్నిస్తోంది. నెక్స్ జీటీవీ(nexGTV) మొబైల్ యాప్ ద్వారా సీరియల్ను నేరుగా మొబైల్ ఫోన్లో చూసే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. ముంబైలో ఒకే ఫ్లాట్ లో నివసించే నలుగురు అమ్మాయిల కథతో రూపొందుతున్న ఈ సీరియల్లో, ప్రియాంక చోప్రా ఓ కీలక పాత్రలో నటించనుంది.