అలాంటి మాటలు ఇక నా నోట రావు!
అభిమానులు లేనిదే మేం లేమని అడపా దడపా సినిమా తారలు అంటుంటారు. అందుకే, వీలు కుదిరినప్పుడల్లా అభిమానుల కోసం కొంత సమయం కేటాయిస్తుంటారు. ఇటీవల ప్రియాంకా చోప్రా అదే చేశారు. తన అభిమానులతో సరదాగా కబుర్లు చెప్పాలనుకున్నారు. ‘నన్నేమైనా అడగండి.. ఫర్వాలేదు’ అని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారామె. ఈ సోషల్ మీడియా ద్వారా అభిమానులు అడిగే ప్రశ్నలన్నిటికీ కాదనకుండా సమాధానాలిచ్చి వాళ్లను ఆనందపర్చాలనుకున్నారు ప్రియాంక. కానీ, అలా చేయలేకపోయారు. ఎందుకంటే, కొంతమంది అభిమానులు అడగకూడని ప్రశ్నలేవో అడిగారు.
ఇలా కూడా అడుగుతారని ఊహించని ప్రియాంక ఒక్కసారిగా ఖంగు తిన్నారు. కాసేపు ఆ షాక్‌లోనే ఉండిపోయి, ఇబ్బందిపెట్టే ప్రశ్నలకు సమాధానాలివ్వలేదామె. అభిమానులతో సరదాగా కాలక్షేపం చేద్దామనుకున్న ప్రియాంకకు చేదు అనుభవమే మిగిలింది. ఈ విషయంలో ‘పశ్చాత్తాప పడుతున్నారా?’ అని ఓ వీరాభిమాని అడిగితే -‘‘అవును. నాకిదో కనువిప్పులాంటిది. భవిష్యత్తులో ఇంకెప్పుడూ ‘నన్నేమైనా అడగండి.. ఫర్వాలేదు’ అనే మాటలు నా నోటి నుంచి రావు. అలాగే, ఈ అనుభవం నాకో మంచి పాఠం అయ్యింది.
ఇప్పుడైతే షాక య్యాను కానీ, భవిష్యత్తులో నన్నెవరైనా అడగకూడని ప్రశ్నలు అడిగితే.. వాళ్ల బతుకు మీద వాళ్లకే విరక్తి పుట్టేలా సమాధానం చెబుతా’’ అన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికి మూడు ప్రైవేట్ ఆల్బమ్స్ విడుదల చేశారు ప్రియాంక. వాటి ద్వారా తనలో మంచి గాయని ఉందని నిరూపించుకున్నారు. మరి.. సినిమాలకు ఎప్పుడు పాడతారు? అనే ప్రశ్న ప్రియాంక ముందుంచితే -‘‘ప్రస్తుతం నేను నటిస్తున్న ‘మేరీ కామ్’ కోసం ఓ పాట పాడనున్నా’’ అని చెప్పారు.