దురలవాట్ల మీద అన్ని పాటలు రాసినా...నాన్నకు ఒక్క దురలవాటూ లేదు! | Producer Kosaraju bhanu Prasad life Updates | Sakshi
Sakshi News home page

దురలవాట్ల మీద అన్ని పాటలు రాసినా...నాన్నకు ఒక్క దురలవాటూ లేదు!

Published Sun, Oct 26 2014 11:06 PM | Last Updated on Sat, Aug 11 2018 8:27 PM

దురలవాట్ల మీద అన్ని పాటలు రాసినా...నాన్నకు ఒక్క దురలవాటూ లేదు! - Sakshi

దురలవాట్ల మీద అన్ని పాటలు రాసినా...నాన్నకు ఒక్క దురలవాటూ లేదు!

 తెలుగు సినిమా పాటకు జానపద సొబగులు అద్దిన రచయిత అంటే - కొసరాజు రాఘవయ్య చౌదరే గుర్తుకు వస్తారు. ‘ఏరువాకా సాగారో...’ (‘రోజులు మారాయి’) అని రైతు జీవితం వర్ణించినా, ‘సరదా సరదా సిగరెట్టు...’ (‘రాముడు - భీముడు’) అని గిలిగింతలు పెట్టినా... ఆ పాటలు అప్పుడూ ఇప్పుడూ ఎవర్‌గ్రీన్. సినీ గీత రచనలో ఆద్యంతం తనదైన ముద్రను కొనసాగించిన ఈ ‘జానపద కవిసార్వభౌము’డి వర్ధంతి నేడు. అచ్చతెలుగు పల్లెటూరి జీవితాన్ని ప్రేమించి, ఆఖరు దాకా వేషభాషల్లో, రచనల్లో అలాగే జీవించిన ఈ ‘కవిరత్న’ జీవిత విశేషాల్లో కొన్ని ఆయన ఏకైక కుమారుడు - సినీ నిర్మాత 80 ఏళ్ళ కొసరాజు భానుప్రసాద్ మాటల్లో...
 
 ఇద్దరన్నదమ్ముల్లో పెద్దవాడు - మా నాన్న కొసరాజు గారు. మాది రైతు కుటుంబం. మా స్వగ్రామం - గుంటూరు జిల్లా అప్పికట్ల. ఆరేడేళ్ళ చిన్నవయసులోనే ఆయన పద్యాలు రాసేవారట, కవిత్వం చెప్పేవారట. అందుకని అప్పట్లో ఆయనను ‘బాలకవి’ అని పిలిచేవారట. గురువు గారు కొండముది నరసింహం పంతులు ప్రభావంతో రాయడం, పాడడం నేర్చుకున్న నాన్న గారికి ‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి చౌదరి బాబాయ్ వరుస అవుతారు.
 
 వరించి వచ్చిన సినిమా ఛాన్సులు
 గూడవల్లి రామబ్రహ్మం రూపొందించిన ‘రైతుబిడ్డ’ (’39)లో నాన్నగారు అనుకోకుండా రచన చేశారు. నటించారు. అప్పుడు నాకు అయిదేళ్ళు. ఆయనకు అసలు ఎప్పుడూ మద్రాసులో సినీ రంగంలో స్థిరపడిపోవాలని ఉండేది కాదు. కొన్నేళ్ళ తర్వాత ‘పెద్దమనుషులు’ (’54), ఆ వెంటనే బి.ఏ. సుబ్బారావు ‘రాజు - పేద’ (’54), ‘రోజులు మారాయి’ (’55)తో దశ తిరిగింది. మద్రాసు వదిలేసి, సొంత ఊరికి వెళ్ళిపోదామని అనుకున్నప్పుడల్లా సినిమా ఛాన్‌‌స రావడం, పాటల విజయవంతం కావడం జరిగేది.  చివరకు ‘రోజులు మారాయి’తో ఆయన మద్రాసులోనే రచయితగా స్థిరపడ్డారు.
 
 ఆయనకున్నది ఆ ఒక్క వ్యసనమే!
 ఒక రకంగా చెప్పాలంటే, నాన్న గారు కులాసా పురుషుడు. హాయిగా, ప్రశాంతంగా జీవించడం, దేనికీ చింతపడకుండా కాలం గడిపేయడం ఆయన లక్షణం. గమ్మత్తేమిటంటే, ధూమపానం మీద (‘సరదా సరదా సిగరెట్టు...’), మద్యపానం మీద  (‘ఏసుకుందాం బుడ్డోడా...’), పేకాట మీద (‘అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే...’) - ఇలా దురలవాట్ల మీద ఆయన చాలా పాటలు రాశారు. అవన్నీ ఇవాళ్టికీ సూపర్‌హిట్లే. ఆయనకు మాత్రం ఆ అలవాట్లేమీ లేవు. ఉన్న ఒకే ఒక్క వ్యసనం- పదే పదే కాఫీ తాగడం!
 
 చిత్ర నిర్మాణంలో...
 మా అమ్మానాన్నలకు నేనొక్కడినే సంతానం. బహుశా అందుకే కావచ్చు, గారాబం చేశారు. ఎకనామిక్స్‌లో నేను ఎం.ఏ చేశా. ఆ తరువాత మద్రాసు లా కాలేజ్‌లో బి.ఎల్. చదివా. కానీ, నాన్న గారి ప్రభావం వల్ల ఇరవై ఆరేళ్ళ వయసులోనే చిత్ర నిర్మాణంలోకి వచ్చా. పూర్తిస్థాయి నిర్మాతగా మారాక, యేడెనిమిది చిత్రాలు చేశా. ‘కవిరత్నా మూవీస్’ పతాకంపై తీసిన 3 చిత్రాలను (ఎన్టీఆర్‌తో ‘విశ్వరూపం’ (’81) వగైరా) నాన్న గారే సమర్పించారు. స్క్రిప్టు విని తన అభిప్రాయాలు చెప్పేవారు.
 
 పాటలన్నీ... జేబులో స్లిప్పుల్లో!
 ఆయన పాటలు రాసే విధానం గమ్మత్తుగా ఉండేది. ఆయన ఎక్కువగా నడిచేవారు. ‘ఈ కాస్త దూరానికి కారెందుకు?’ అంటూ, దర్శక - నిర్మాతల దగ్గరకు నడిచి వస్తానని అనేవారు. నడక ఆరోగ్యానికి మంచిదనేవారు. ఆయన జేబుల్లో ఎప్పుడూ స్లిప్పులు ఉండేవి. రోడ్డు మీద వెళుతున్నప్పుడైనా సరే ఎప్పుడు ఏ ఆలోచన వచ్చినా, గబగబా వాటిలో రాసేసుకొనేవారు. అయిదొందలు, వెయ్యి రూపాయల పారితోషికంతో అంత అద్భుతమైన పాటలు రాశారంటే, ఇవాళ ఆశ్చర్యం కలుగుతుంది. చరమాంకంలో ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ వచ్చింది.
 
 జరగాల్సిన దాని మీదే దృష్టి!
 నాన్న గారి నుంచి నేను నేర్చుకున్న విషయం ఏమిటంటే - మంచే కాదు, చెడు జరిగినా సరే దాని గురించే ఆలోచిస్తూ గడిపేవారు కాదు. ‘తరువాత ఏంటి? ఏం చేద్దాం?’ అనేవాళ్ళు. సినిమాలు తీస్తున్నప్పుడు నష్టాలే ఎక్కువసార్లు వచ్చినా, తరువాతి ప్రాజెక్ట్ గురించే ఆలోచించేవారు. ఆయనకు అంత తేలిగ్గా కోపం రాదు. మంచిగా చెప్పడమే కానీ, ఎవరినీ కోప్పడేవారు కాదు. పిల్లల పెంపకంలో కూడా ఆ రోజుల్లో ఆయనది చాలా చిత్రమైన పద్ధతి. ఎప్పుడూ క్రమశిక్షణ, కట్టుదిట్టమైన నియమ నిబంధనల లాంటివి లేవు. నన్నెప్పుడూ స్నేహితుడి లాగానే చూసేవారు. మా అబ్బాయి రంజన్‌కు కూడా చదువు విషయం బుజ్జగిస్తూ, చెబుతుండేవారు. సినిమాల కోసం నాన్న గారు దాదాపు వెయ్యి పాటలు రాశారనుకుంటా. వాటిలో ఇప్పటికి 800 దాకా పాటలు సేకరించగలిగాం. వచ్చే జూన్‌లో నాన్న గారి పుట్టినరోజు నాటికి, పుస్తకంగా తీసుకురావాలని మా ప్రయత్నం.
 
 ‘‘నాన్న గారెప్పుడూ చాలా సాదాసీదాగా, ధోవతి - లాల్చీ, పైన కండువాతో అచ్చ తెలుగు వేషధారణలో సామాన్యరైతులా ఉండేవారు. ఇంటి బయట వరండాలో అరుగు మీద బనీనైనా లేకుండా కూర్చొని హాయిగా పల్లెటూరి పద్ధతిలో ముచ్చట్లాడడం ఆయన అలవాటు.’’
 
 సంభాషణ:: రెంటాల జయదేవ
 ఫోటోలు: వన్నె శ్రీనివాసులు, సాక్షి, చెన్నై

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement