
రవిశంకర్, చెర్రీ
‘‘మత్తు వదలరా’ చిత్రవిజయంలో మా క్రెడిట్ ఏం లేదు. కథ విని బావుందని మాత్రమే చెప్పాం. విజయం టీమ్‌కే దక్కుతుంది’’ అన్నారు నిర్మాతలు చెర్రీ (చిరంజీవి), రవిశంకర్. కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా రితేష్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా’. కీరవాణి మరో అబ్బాయి కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌తో నడుస్తోందని చిత్రనిర్మాతలు చెర్రీ, రవిశంకర్ పేర్కొన్నారు.
చెర్రీ మాట్లాడుతూ– ‘‘రితేష్ కథ చెప్పినప్పుడే క్లియర్‌గా, క్లారిటీగా ఉన్నాడనే నమ్మకం కుదిరింది. హీరో, ముఖ్య పాత్రల్లో ఎక్కువ శాతం కొత్తవాళ్లే కావాలన్నాడు. శ్రీ సింహా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అతనెలా ఉంటాడో చూడు అన్నాను. అయితే సింహా.. కీరవాణిగారి అబ్బాయి అని నేను చెప్పలేదు. ఆడిషన్ చేసి సింహాను సెలక్ట్ చేసుకున్నాడు రితేష్. కీరవాణి, ఆయన భార్య వల్లీ, రాజమౌళి ఎవరూ ఈ కథ వినలేదు. నీకు నమ్మకం ఉంటే చేసేయ్ అని నన్ను నమ్మారు.
ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్, డీఐ కోసం రెండు కంప్యూటర్స్ అద్దెకి తీసుకొని డైరెక్షన్ టీమే చేశారు. బయట చేస్తే 60 లక్షలు అవుతుంది. సినిమాకి వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందంగా ఉంది. కొత్త టాలెంట్‌ను ఇలానే ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. రవిశంకర్ మాట్లాడుతూ – ‘‘రెండు కోట్లా నాలుగు లక్షల్లో సినిమా తీశాం. రెండు సెట్లు, రెండు ఫ్లాట్స్ వాడాం. ఫైట్ సీన్స్‌కి కావాల్సిన సామగ్రిని కూడా డైరెక్షన్ టీమే తయారుచేసుకుంది. సింహాకి మంచి పేరు వచ్చింది. కాలభైరవ మ్యూజిక్‌కి మంచి పేరొస్తోంది. మా బ్యానర్‌లో నెక్ట్స్ ‘ఉప్పెన’ సినిమా రాబోతోంది. ఏప్రిల్‌లో రిలీజ్ చేస్తాం’’ అన్నారు.