‘సుందరకాండ’ సినిమా గుర్తొచ్చింది!
‘‘హీరో ఇద్దరమ్మాయిల్ని ప్రేమించడం... ఈ సినిమా కథ. ఇది వినగానే... నాకు నా తొలి చిత్రం ‘బద్రి’ గుర్తొచ్చింది. ఆ కథ పవన్‌కల్యాణ్‌కి చెప్పడానికి నేను పడిన తిప్పలు కళ్లముందు కదిలాయి’’ అని గతాన్ని గుర్తు చేసుకున్నారు పూరి జగన్నాథ్. ఆయన తమ్ముడు సాయిరామ్‌శంకర్ కథానాయకునిగా ‘బంపర్ ఆఫర్’ ఫేం జయ రవీంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దిల్లున్నోడు’. కె.వి.వి.సత్యనారాయణ సమర్పణలో, కె.వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శేఖర్‌చంద్ర స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. పూరీ జగన్నాథ్ ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని దశరథ్‌కి అందించారు.
‘‘ఇద్దరమ్మాయిలతో హీరో ప్రేమను కన్విన్సింగ్‌గా చూపిస్తే అద్భుతంగా ఉంటుంది. అలా చూపించగల ప్రతిభ దర్శకునిలో ఉంది. ట్రైలర్స్, పాటలు చాలా బాగున్నాయి. సినిమా కూడా బాగుంటుంది’ అని పూరి నమ్మకం వ్యక్తం చేశారు. పాటల విషయంలో శేఖర్‌చంద్రను చాలా హింస పెట్టానని, కె.వి.వి.సత్యనారాయణ సహకారం వల్లే సినిమాను అనుకున్న రీతిగా పూర్తి చేయగలిగానని దర్శకుడు చెప్పారు. ఎప్పట్నుంచో సాయితో సినిమా చేయాలనుకుంటున్నానని, ఇన్నాళ్లకు కుదిరిందని, మళ్లీ సాయితో సినిమా తీస్తానని నిర్మాత తెలిపారు.
‘‘ఆరోగ్యం బాగుండకపోయినా.. డబ్బింగ్ పూర్తి చేసిన ధర్మవరపు సుబ్రమణ్యంగారి రుణం తీర్చుకోలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. జయరవీంద్రతో నేను చేసిన ‘బంపర్‌ఆఫర్’లాగే ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించాలి’’ అని సాయిరామ్‌శంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కె.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ -‘‘ఈ సినిమా చూస్తే నా ‘సుందరకాండ’ గుర్తొచ్చింది. మంచి ప్రేమకథ’’ అని చెప్పారు. కథానాయికలు జాస్మిన్, ప్రియదర్శిని కూడా మాట్లాడారు.