Dillunnodu
-
ప్రేమించడంలో దిల్లున్నోడు
‘‘ ‘బంపర్ ఆఫర్’ హిట్ తర్వాత నేను, దర్శకుడు జయ రవీంద్ర కలిసి చేసిన సినిమా ఇది. ఇందులో నా పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేమించడంలో దిల్లున్నోడినని నిరూపించుకునే పాత్ర నాది’’ అని సాయిరామ్ శంకర్ చెప్పారు. సాయిరామ్ శంకర్, ప్రియదర్శిని, జాస్మిన్ కాంబినేషన్లో జయ రవీంద్ర దర్శకత్వంలో శ్రీ సౌదామినీ క్రియేషన్స్ పతాకంపై కేవీవీ సత్యనారాయణ సమర్పణలో కె. వేణుగోపాల్ నిర్మించిన ‘దిల్లున్నోడు’ ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో కేవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం సినిమా పరిశ్రమ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. చిన్న సినిమాలకు శాటిలైట్ బిజినెస్ కావడం లేదు. అదృష్టం కొద్దీ మా సినిమాకు శాటిలైట్ బిజినెస్ అయ్యింది’’ అని తెలిపారు. ఒకమ్మాయిని ప్రేమిస్తూ తన పాత గాళ్‌ఫ్రెండ్‌తో కూడా ప్రేమాయణం సాగించే కుర్రాడి కథ ఇదని దర్శకుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్న కుమార్, డీఎస్ రావు, జిగినీ నాగభూషణం మాట్లాడారు. -
‘సుందరకాండ’ సినిమా గుర్తొచ్చింది!
‘‘హీరో ఇద్దరమ్మాయిల్ని ప్రేమించడం... ఈ సినిమా కథ. ఇది వినగానే... నాకు నా తొలి చిత్రం ‘బద్రి’ గుర్తొచ్చింది. ఆ కథ పవన్‌కల్యాణ్‌కి చెప్పడానికి నేను పడిన తిప్పలు కళ్లముందు కదిలాయి’’ అని గతాన్ని గుర్తు చేసుకున్నారు పూరి జగన్నాథ్. ఆయన తమ్ముడు సాయిరామ్‌శంకర్ కథానాయకునిగా ‘బంపర్ ఆఫర్’ ఫేం జయ రవీంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దిల్లున్నోడు’. కె.వి.వి.సత్యనారాయణ సమర్పణలో, కె.వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శేఖర్‌చంద్ర స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. పూరీ జగన్నాథ్ ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని దశరథ్‌కి అందించారు. ‘‘ఇద్దరమ్మాయిలతో హీరో ప్రేమను కన్విన్సింగ్‌గా చూపిస్తే అద్భుతంగా ఉంటుంది. అలా చూపించగల ప్రతిభ దర్శకునిలో ఉంది. ట్రైలర్స్, పాటలు చాలా బాగున్నాయి. సినిమా కూడా బాగుంటుంది’ అని పూరి నమ్మకం వ్యక్తం చేశారు. పాటల విషయంలో శేఖర్చంద్రను చాలా హింస పెట్టానని, కె.వి.వి.సత్యనారాయణ సహకారం వల్లే సినిమాను అనుకున్న రీతిగా పూర్తి చేయగలిగానని దర్శకుడు చెప్పారు. ఎప్పట్నుంచో సాయితో సినిమా చేయాలనుకుంటున్నానని, ఇన్నాళ్లకు కుదిరిందని, మళ్లీ సాయితో సినిమా తీస్తానని నిర్మాత తెలిపారు. ‘‘ఆరోగ్యం బాగుండకపోయినా.. డబ్బింగ్ పూర్తి చేసిన ధర్మవరపు సుబ్రమణ్యంగారి రుణం తీర్చుకోలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. జయరవీంద్రతో నేను చేసిన ‘బంపర్ఆఫర్’లాగే ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించాలి’’ అని సాయిరామ్‌శంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కె.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ -‘‘ఈ సినిమా చూస్తే నా ‘సుందరకాండ’ గుర్తొచ్చింది. మంచి ప్రేమకథ’’ అని చెప్పారు. కథానాయికలు జాస్మిన్, ప్రియదర్శిని కూడా మాట్లాడారు. -
దిల్లున్నోడి కథ
అతను బాగా దిల్లున్నోడు. ఏదైనా అనుకుంటే అది సాధించడానికి ఎంతకైనా తెగిస్తాడు. ఈ నేపథ్యంతో రూపొందిన చిత్రం ‘దిల్లున్నోడు’. సాయిరామ్ శంకర్ హీరోగా ‘బంపర్ ఆఫర్’ ఫేమ్ జయరవీంద్ర దర్శకత్వంలో శ్రీ సౌదామినీ క్రియేషన్స్ పతాకంపై కె.వి.వి.సత్యనారాయణ సమర్పణలో కె.వేణుగోపాల్ నిర్మించిన చిత్రం ఇది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి ద్వితీయార్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కె.వేణుగోపాల్ మాట్లాడుతూ -‘‘ఇది యూత్‌ఫుల్ ఎంటర్టైనర్. యూత్‌కి, మాస్‌కి నచ్చే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ‘బంపర్ ఆఫర్’లాంటి హిట్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ వారంలో పాటలను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. దర్శకుడు జయ రవీంద్ర మాట్లాడుతూ -‘‘ఇందులో మొత్తం 5 పాటలున్నాయి శేఖర్‌చంద్ర సంగీతం ఆకట్టుకుంటుంది. ’’ అని చెప్పారు. జాస్మిన్, ప్రియదర్శిని ఇందులో కథానాయికలు.