ప్రేమించడంలో దిల్లున్నోడు
‘‘ ‘బంపర్ ఆఫర్’ హిట్ తర్వాత నేను, దర్శకుడు జయ రవీంద్ర కలిసి చేసిన సినిమా ఇది. ఇందులో నా పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేమించడంలో దిల్లున్నోడినని నిరూపించుకునే పాత్ర నాది’’ అని సాయిరామ్ శంకర్ చెప్పారు. సాయిరామ్ శంకర్, ప్రియదర్శిని, జాస్మిన్ కాంబినేషన్‌లో జయ రవీంద్ర దర్శకత్వంలో శ్రీ సౌదామినీ క్రియేషన్స్ పతాకంపై కేవీవీ సత్యనారాయణ సమర్పణలో కె. వేణుగోపాల్ నిర్మించిన ‘దిల్లున్నోడు’ ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో కేవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం సినిమా పరిశ్రమ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. చిన్న సినిమాలకు శాటిలైట్ బిజినెస్ కావడం లేదు. అదృష్టం కొద్దీ మా సినిమాకు శాటిలైట్ బిజినెస్ అయ్యింది’’ అని తెలిపారు. ఒకమ్మాయిని ప్రేమిస్తూ తన పాత గాళ్‌ఫ్రెండ్‌తో కూడా ప్రేమాయణం సాగించే కుర్రాడి కథ ఇదని దర్శకుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్న కుమార్, డీఎస్ రావు, జిగినీ నాగభూషణం మాట్లాడారు.