అదే నా ప్లస్‌ పాయింట్‌ | puri jagannadh interview about ismart shankar | Sakshi
Sakshi News home page

అదే నా ప్లస్‌ పాయింట్‌

Published Tue, Jul 16 2019 2:19 AM | Last Updated on Tue, Jul 16 2019 5:16 AM

puri jagannadh interview about ismart shankar - Sakshi

పూరి జగన్నాథ్‌

‘‘నేను, రామ్‌ కలిసి ఓ సినిమా చేద్దామని చాలా రోజులుగా అనుకున్నా కుదరలేదు. అయితే మా కాంబినేషన్‌లో సినిమా అదిగో, ఇదిగో అంటూ మీడియాలో వార్తలొచ్చాయి. అప్పుడు మేమిద్దరం కలిసి ఎలాంటి సినిమా చేద్దాం అని చర్చించుకున్నాం’’ అని పూరి జగన్నాథ్‌ అన్నారు. రామ్‌ హీరోగా, నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ హీరోయిన్లుగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’.  పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్‌ పంచుకున్న విశేషాలు...

► ‘టెంపర్‌’ సినిమా తర్వాత నాకు సరైన హిట్‌ లేదు. దీంతో కొంచెం టెన్షన్‌గా ఉంది. ఇస్మార్ట్‌గా ఆలోచించి నా రెగ్యులర్‌ ఫార్మాట్‌కి భిన్నంగా కొత్తగా ఆలోచించి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కథ రాశా. పైగా రామ్‌ కూడా గుడ్‌ బాయ్‌ కథలు చేసి బోర్‌ కొట్టేసింది.. బ్యాడ్‌ బాయ్‌గా చూపించమన్నాడు. అందుకే ఇదొక బ్యాడ్‌ బాయ్‌ కథ.

► సినిమా హిట్‌ అయితే వెధవ కూడా జీనియస్‌లా కనిపిస్తాడు.. అదే ఫ్లాప్‌ అయితే జీనియస్‌ కూడా వెధవలా కనిపిస్తాడు. ఈ సినిమాలో హీరోకి చిప్‌ పెట్టే ఐడియా హాలీవుడ్‌ సినిమా నుంచి స్ఫూర్తి పొందా. నా కథలన్నింటిలో ఏదో ఒక స్ఫూర్తి కనిపిస్తుంటుంది.

► ఈ కథ స్టార్ట్‌ చేశాక తెలంగాణ యాస పెట్టాలనిపించింది. పైగా రామ్‌ ఇప్పటివరకూ తెలంగాణ యాసలో మాట్లాడలేదు. తొలిసారి ఈ సినిమా మొత్తం అదే యాసలో మాట్లాడటాన్ని బాగా ఎంజాయ్‌ చేశాడు. తెలంగాణ భాష నాకు కొంచెం తెలుసు.. పూర్తిగా రాసేందుకు కో డైరెక్టర్‌ శ్రీ«దర్‌ సహాయం చేశాడు. పైగా నా భార్య తెలంగాణలోనే పుట్టింది. మా కొడుకు ఆకాశ్‌  తెలంగాణ యాస బాగా మాట్లాడతాడు.

► ఇండియాలో ఎక్కడైనా ప్రజల మధ్య షూటింగ్‌ చేయడం చాలా కష్టం. పైగా చార్మినార్‌ వంటి రద్దీ ప్రదేశంలో షూటింగ్‌ జరుగుతుంటే జనాలు మీదపడ్డారు. ఆ విషయం అటుంచితే, షూటింగ్‌ జరుగుతుంటే వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టేస్తున్నారు.. అదే పెద్ద సమస్య.

► ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కథ మాకు తెలుసు.. డబ్బులివ్వకుంటే బయటపెట్టేస్తామని కొందరు బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాం. నిర్మాత అన్నాక ఇలాంటివన్నీ చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మా సినిమా టీజర్, ట్రైలర్స్‌కి మంచి స్పందన వస్తోంది.. సినిమాపై పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయింది. ట్రైలర్స్‌ చూశాక కొంతమంది మహిళలే ఫోన్‌ చేసి బాగుందన్నారు. చాలా మంచి మ్యూజిక్‌ ఇచ్చిన మణిశర్మగారికి థ్యాంక్స్‌.

► ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో తన మేకోవర్‌ క్రెడిట్‌ అంతా రామ్‌దే. తన పాత ఫొటో చూసి ఈ హెయిర్‌ స్టైల్‌ బాగుంది, దీన్ని కంటిన్యూ చేద్దామని మాత్రమే నేను చెప్పా. ఇందులో నభా నటేశ్‌ది చాలా హైపర్‌ పాత్ర. తనది కూడా తెలంగాణే. నిధీ అగర్వాల్‌ డాక్టర్‌గా చేశారు. రామ్‌లో బోలెడంత ఎనర్జీ ఉంది. తను చిరుతపులి అని సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాలో తన నటన చూసి కొత్తవారు నేర్చుకోవచ్చు.

► తెలంగాణ యాస ఆంధ్రవారికి అర్థం కాదని మనం అనుకుంటామంతే.. అందరికీ బాగా అర్థమవుతుంది. నా కాలేజీరోజుల్లో ఫ్రెండ్స్‌తో కలిసి తెలంగాణ ఫోక్‌ పాటలు పాడేవాణ్ణి.. గద్దర్‌గారి పాటలు వినేవాణ్ణి. సెట్‌లో షూటింగ్‌ అంతా ప్రశాంతంగా జరిగేలా వాతావరణం సృష్టిస్తా. ప్రత్యేకించి నటీనటులు ఎటువంటి టెన్షన్‌ పడకుండా ఉండేలా చూస్తా. అందుకే ప్రశాంతంగా వారి పాత్రల్లో లీనమై నటించగలుగుతారు.

► మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కినా కుటుంబ సభ్యులతో కలిసి చూసేలా ఉంటుంది. ఈ మధ్య పూర్తి సినిమా చూసిన రామ్‌ ఎగై్జట్‌ అయ్యి.. నన్ను హత్తుకుని మనశ్శాంతిగా విదేశాలకు వెళ్లిపోయాడు. ఈ చిత్రానికి సీక్వెల్‌ చేద్దామనే టైటిల్‌ కూడా రిజిస్టర్‌ చేయించాం. ఈ సినిమాపై అంత నమ్మకం ఉంది మాకు.

► చార్మి.. మగాళ్ల కంటే బాగా కష్టపడి పనిచేస్తుంది. మాకు ఏ టెన్షన్‌ కూడా ఉండదు. నా దర్శకత్వంలో బయటి నిర్మాతలతో చేస్తున్నప్పుడు బడ్జెట్‌ కంట్రోల్‌లో ఉంటుంది. నేనే నిర్మాత అయినప్పుడు అస్సలు కంట్రోల్‌లో ఉండదు. నేనెప్పుడూ నిర్మాతలను ఇబ్బంది పెట్టను.. అదే నా ప్లస్‌ పాయింట్‌. షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల ఈ మధ్య సినిమాలు చూసింది తక్కువే. కానీ, ‘జెర్సీ, మజిలీ, ఏజెంట్‌ సాయిశ్రీనివాస ఆత్రేయ, బ్రోచేవారెవరురా, ఓ బేబీ’ వంటి వైవిధ్యమైన సినిమాలొచ్చాయి.  

► మా అబ్బాయి ఆకాశ్‌ హీరోగా ఓ సినిమా నిర్మిస్తున్నా.. 50 శాతం షూటింగ్‌ పూర్తయింది. బాలకృష్ణగారితో సినిమా చేయడానికి కథ ఇంకా సిద్ధం కాలేదు. కథ రెడీ కాగానే వెళ్లి ఆయన్ని కలుస్తా. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తర్వాతి ప్రాజెక్టు గురించి ఇంకా ఏం అనుకోలేదు.. ఈ సినిమా విడుదల తర్వాత చెబుతా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement