పూరీ జగన్నాథ్ తనయుడు హీరోగా 'ఆంధ్ర పోరీ'
పూరి ఆకాశ్ బాలనటునిగా ఉన్నప్పుడే... ‘భవిష్యత్ హీరో’గా ప్రేక్షకులు ఫిక్సయిపోయారు. ‘చిరుత, బుజ్జిగాడు... మేడిన్ చెన్నై, గబ్బర్‌సింగ్, ధోనీ’ తదితర చిత్రాల్లో బాలనటునిగా ఆకాశ్ కనబరిచిన అభినయమే దానికి కారణం. పసి వయసులోనే మాస్ మెచ్చే అభినయాన్ని కనబరిచి, తనపై ఉన్న అంచనాలను పెంచేశాడు ఆకాశ్. ఈ చిచ్చరపిడుగు హీరోగా మారే ఘడియ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కూడా లేకపోలేదు. ఎట్టకేలకు వారి ఎదురు చూపులకు తెరదించుతూ హీరోగా ఆకాశ్ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది.
అయితే... అందరూ ఊహించినట్లు ఈ చిత్రానికి తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకుడు కాదు. ‘ఋషి’ ఫేం రాజ్ ముదిరాజ్ దర్శకుడు. సినిమా పేరు ‘ఆంధ్రాపోరి’. ప్రసాద్ సంస్థల అధినేత ఎ.రమేశ్‌ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. పూరీ దంపతులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు. మరాఠీలో ఘనవిజయం సాధించిన ‘టైంపాస్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందతోన్న ఈ చిత్రంలో ఆకాశ్‌కు జోడీగా ఉల్కా గుప్తా నటిస్తున్నారు. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.