పూరి దగ్గర చాలా కళలున్నాయ్
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలోని అన్ని రంగాల మీద పట్టు చూపిస్తున్నాడు. ఇప్పటికే కథా రచయితగా, మాటల రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, కాస్టింగ్ డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్న పూరి.., తాజాగా తనలోని మరిన్ని కళల్ని చూపిస్తున్నాడు. గతంలో మహేష్ హీరోగా తెరకెక్కిన బిజినెస్మేన్ సినిమాలో ఓ పాటకు గొంతు కలిపిన పూరి, తన తాజా చిత్రంలో రెండు పాటలు పాడాడు.
ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా ఇజం సినిమాను తెరకెక్కిస్తున్న పూరి, ఈ సినిమాలో రెండు పాటలు పాడాడు. ఎయ్ ఎయ్ ఎయ్రా అంటూ సాగే పాటతో పాటు ఇజం టైటిల్ సాంగ్కు గొంతు కలిపాడు. అంతేకాదు, ఇప్పటి వరకు కథలు, మాటలు మాత్రమే రాసిన ఈ స్టార్ డైరెక్టర్, ఈ సినిమాతో గేయ రచయితగా కూడా మారిపోయాడు. ఇజం టైటిల్ సాంగ్ను తానే స్వయంగా రాశాడు పూరి. అనూప్ రుబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాలోని మిగతా పాటలను పూరి, ఆస్థాన రచయిత భాస్కరబట్ల రాశాడు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మాజీ మిస్ ఇండియా అదితి ఆర్య హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియోను అక్టోబర్లో, సినిమాను నవంబర్లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.