
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తీయాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. ఫలితంగా ఆమె బయోపిక్‌పై మూడు సినిమాలు రానున్నాయి. కంగనా రనౌత్ ‘తలైవి’, నిత్యామీనన్ ‘ద ఐరన్ లేడీ’ సినిమాలతో పాటు డిజిటల్ మాధ్యమంలో రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో ‘క్వీన్’ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ చిత్రానికి గౌతమ్ మీనన్, మురుగేశన్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. అటు న్యాయపరంగా ఇబ్బందులు తలెత్తకుండా చిత్రబృందం జయలలిత పాత్రకు శక్తి శేషాద్రి అని నామకరణం చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం అందరి నుంచీ ప్రశంసలు అందుకుంటోంది.
శక్తి.. ఏమీ తెలియని బాల్యం నుంచి అందర్నీ శాసించే రాజకీయ నాయకురాలిగా ఎదిగిన తీరు, ఆమె సంఘర్షణ, పోరాటతత్వం అన్నీ కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి. చిన్నప్పటి శక్తి పాత్రను అనిక పోషించగా యవ్వనంలో అంజనా జయప్రకాశ్ తెరమీద ప్రత్యక్షమవుతుంది. శక్తి రాజకీయ ప్రస్థానాన్ని టాలీవుడ్ నటి రమ్యకష్ణ మరింత రక్తి కట్టించిందనడంలో సందేహం లేదు. శక్తి బాల్యం నుంచే ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ ముళ్లదారిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ చివరాఖరకు విజయాన్ని ముద్దాడింది. ఒక్కసారి నటిగా గుర్తింపు వచ్చిన తర్వాత బాల్యంలో దక్కని ప్రేమ, అభిమానాలు ఆమెను చుట్టుముట్టడం విశేషం.
శక్తి.. సమాజంలోని అసమానతలను, పితృస్వామ్య ధోరణిలను నిర్భయంగా, నిస్సందేహంగా నిలదీస్తుంది. అక్కడే ఆమెలోని నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. తనకు ఎదురయ్యే ప్రతీ సమస్యను ఎదుర్కొంటూ మరింత రాటు దేలుతూ వచ్చిందే తప్ప కుంగిపోయి ఆమె ప్రయాణాన్ని ఆపలేదు. అదే ఆమెను గొప్ప స్త్రీగా నిలబెట్టింది. నటిగా, నాయకురాలిగా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ఇక రాజకీయ ఎంట్రీతో ఆమె జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది.
శక్తి(జయలలిత) ఎంతగానో గౌరవించే ఎమ్‌జీఆర్ పాత్రలో నటుడు ఇంద్రజిత్ సుకుమార్ దర్శనమిస్తాడు. వీరి కలయికలో వచ్చే సీన్లు ఆసక్తికరంగా ఉంటాయి. మొత్తంగా చెప్పాలంటే శక్తి జీవితంలో ఎత్తుపల్లాలను స్పృశిస్తూనే, ఓ గొప్ప నాయకురాలిగా అందరి మనసులో ఎలా స్థానం సంపాదించిందన్నదే కథ. సామాజిక వ్యత్యాసాలు, పురుషాధిక్యం వంటి సమస్యలను కూడా టచ్ చేస్తుందీ సినిమా. రాజకీయ నాయకురాలిగా రమ్యకృష్ణ ఠీవి, అధికారం, ఆమె నటన అద్భుతంగా ఉంటుంది. మొత్తానికి తమిళ వెబ్‌సిరీస్‌లో క్వీన్ ప్రత్యేక స్థానం దక్కించుకోవడంతోపాటు అమ్మ(జయలలిత) అభిమానులు మర్చిపోలేని చిత్రంగా మిగిలిపోతుందనటంలో అతిశయోక్తి లేదు.
Comments
Please login to add a commentAdd a comment