( రాధారవి ) చిన్మయి
పెరంబూరు: వదల బొమ్మాళి వదలా అది నిన్నటి సినిమా డైలాగ్. నేటి నిజ డైలాగ్ చిన్మయీ నిన్నొదలా. ఏంటీ అర్థంకా? గాయని ఏ ముహూర్తంలో సీనియర్ నటుడు రాధారవిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిందో గానీ, అది ఆరని మంటగా రగులుతూనే ఉంది. గాయని చిన్మయి ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై కూడా లైంగికవేధింపుల ఆరోపణలు గుప్పించింది. అయితే అది ఆరోపణలు, ఖండించడాలతో సరిపెట్టుకుంది. రాధారవి, చిన్మయిల మధ్య కోల్డ్ వార్ కాదు, డైరెక్ట్ వార్‌నే జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఎవరివి తప్పొప్పులన్న విషయం పక్కన పెడితే ఒకరిపై ఒకరు ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని చెప్పవచ్చు. తనపై లైంగిక ఆరోపణలు చేసిన గాయని, డబ్బింగ్ కళాకారిణి చిన్మయిపై ప్రతీకారంగా రాధారవి తను అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న దక్షిణభారత సినీ, టీవీ డబ్బింగ్ కళాకారుల సంఘం నుంచి ఆమె సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
అందుకు చిన్మయి రెండేళ్లుగా సభ్యత్వ రుసుము కట్టడం లేదన్న సాకును చూపించారు. అలా రాధారవి గాయని చిన్మయి వృత్తిపై పెద్ద దెబ్బ తీశారు. అయితే తనను సంఘం నుంచి తొలగించడం ఎవరి తరం కాదని, తాను శాశ్విత సభ్యురాలినని తెలిపిన చిన్మయి ఈ వ్యవహారంలో న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తానని అంటోంది. అంతటితో ఆగకుండా రాధారవి పరువు మీద దెబ్బకొట్టేలాంటి చర్యలకు పాల్పడింది. నటుడు రాధారవి తన పేరుకు ముందు దత్తో అనే మలేషియా ప్రభుత్వం అందించిన బిరుదును తగిలించుకుంటారు. అయితే ఆ బిరుదు నకిలీదన్న విషయాన్ని గాయనీ చిన్మయి బట్టబయలు చేసింది. తాను మలేషియా ప్రభుత్వానికి ఈ విషయమై లేఖ రాశానని, అందుకు స్పందించిన ఆ ప్రభుత్వం రాధారవికి అలాంటి బిరుదు ఇవ్వలేదని చెప్పినట్లు చిన్మయి తన ట్విట్టర్‌లో పేర్కొని కలకలం సృష్టించింది. దీంతో రాధారవి ఆమెపై మండిపడుతున్నారు. ఆయన సోమవారం ఒక మీడియాతో మాట్లాడుతూ గాయని చిన్మయి అబద్దాల మీద అబద్దాలు వల్లివేస్తోందన్నారు. ఆమె గీతరచయిత వైరముత్తును బ్లాక్ మెయిల్ చేసేలా ఆయనపై అసత్యలైంగిక వేధింపుల ఆరోపణలు చేసిందన్నారు. తరువాత తనపైకి వచ్చిందని,తన వద్ద ఇవ్వడానికి ఏమీ లేదు నిజాలు తప్ప అని అన్నారు. తనకు దత్తో అవార్డును ప్రదానం చేసిన వారితోనే నిజాలు చెప్పిస్తానని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. అదే విధంగా చిన్మయిని తాను వదిలేది లేదని అన్నారు. మరి వీరిద్దరి మధ్య వార్ ఎటు దారి తీస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment