అదో అందమైన అనుభవం!
ప్రకృతిలోని అందాలను ఆస్వాదించడం ఒక కళ. అందులోనూ ఆస్ట్రేలియా లాంటి సుందరమైన ప్రదేశాలను చూడడానికి రెండు కళ్లు చాలవు. ఆ దేశంలోని కొన్ని మనసు పులకించే అందమైన ప్రాంతాలను నటి రాధికాశరత్‌కుమార్ ఇటీవల సందర్శంచి మైమరచారు.తను ప్రధాన పాత్ర పోషిస్తున్న వాణిరాణి మెగా సీరియల్ చిత్రీకరణ కోసం యూనిట్‌తో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లారు.అక్కడ వాణిరాణి సీరియల్ కోసం 10 ఎపిసోడ్ సను చిత్రీకరిస్తున్నారట.అందులో భాగంగా ఆస్ట్రేలియాలో తను విహారయాత్ర అనుభూతుల్ని కింది విధంగా రాధికాశరత్‌కుమార్ పంచుకున్నారు. ప్రకృతిలోని అందాలను ఆస్వాదించడం నాకు చాలా ఫ్యాషన్ .
అదే విధంగా అటవీజంతువులన్నా చాలా ఆసక్తి. అలాంటి అరుదైన ప్రకృతి సౌందర్యాలను తిలకించే అవకాశం ఇప్పుడు లభించింది. ఆస్ట్రేలియా దేశాన్ని అందాలకు నిలయంగా పేర్కొనవచ్చు. ముఖ్యంగా విక్టోరియా సమీపంలోని మెల్‌బోర్న్, ఫిలిప్ ఐల్యాండ్, పెన్ గున్ ప్యారడే, సముద్ర తీరం వంటి పలు ప్రాంతాలు మనల్ని ముగ్ధుల్ని చేస్తాయి. ఆ దేశ జాతి జంతువు కంగారు,పెగ్విన్ లు చూడముచ్చటగా ఉంటాయి. ఫిలిప్ ఐల్యాండ్‌లో 90 నిమిషాల హైస్పీడ్ బోట్ రైడింగ్ చాలా థ్రిల్లింగ్ అనుభవం. ఆ సముద్ర తీరం ప్రాంతంలో అందమైన భవనాలతో కూడిన విశాలమైన వీధుల వీక్షణం మనసుకు ఉల్లాసాన్ని కలిగించింది.బల్లారత్ వైల్డ్ పార్క్‌ను సందర్శించకుంటే ఆస్ట్రేలియా పర్యటన సంతృప్తిని కలిగించదు. అదే విధంగా సావరింగ్ హిల్, అవుట్‌డోర్ మ్యూజియం లాంటివి సరికొత్త అనుభూతికి గురి చేస్తాయి.
ముఖ్యంగా అవుట్‌డోర్ మ్యూజియంలో 1800 రకాల జంతుజీవరాసులను చూడవచ్చు. ఇక ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ను ఒక్క సారైనా చూసి తీరాల్సిందే. అందులోని ఎంసీసీ లాంగ్‌రూమ్, ఎంసీసీ లైబ్రరీ, క్రికెట్ వ్యూవింగ్ రూమ్ వంటివి కనువిందు చేస్తాయి. ఆ గ్రౌండ్‌లో మన క్రిడాకారులు తమ ఉత్తమ ప్రతిభను చాటుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా డోనాల్డ్ బ్రాడ్మన్, సచిన్ వంటి క్రీడాకారులు తమ అద్భుతమైన ఆటతీరుతో మనల్ని అలరించారు. అదే విధంగా గ్రేట్ ఓషన్ రోడ్, కాలనియల్ ట్రమ్ కార్ రెస్టారెంట్ వంటి ప్రదేశాలు మనల్ని కొత్త లోకాలకు తీసుకెళతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆస్ట్రేలియా అందాలెన్నో.ఆ అందాలను ఆస్వాదించడానికి మరోసారి కుటుంబంతో కలిసి రావాలన్న కోరిక కలుగుతోంది.