రాహుల్ విజయ్
‘‘నా తొలి సినిమా ‘ఈ మాయ పేరేమిటో’ రిలీజ్ కాకముందే సైన్ చేసిన చిత్రం ‘సూర్యకాంతం’. వరుణ్ అన్న చెబితే కథ విన్నా, నచ్చింది చేశా. నా తొలి సినిమా ఎంత ఆడిందనే విషయాన్ని పక్కనపెడితే నటుడిగా నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘కుర్రాడు బాగా చేశాడు’ అని అందరూ అన్నారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా, నా పాత్రకు నేను న్యాయం చేసినప్పుడు బాధపడను’’ అని రాహుల్ విజయ్ అన్నారు. నిహారిక కొణిదెల, పెర్లెన్ భేసానియా, రాహుల్ విజయ్ ముఖ్య తారలుగా ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సూర్యకాంతం’. వరుణ్ తేజ్ సమర్పణలో సందీప్ ఎర్రంరెడ్డి, సుజన్ ఎరబోలు, రామ్ నరేష్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాహుల్ విజయ్ చెప్పిన విశేషాలు.
► ‘సూర్యకాంతం’ తొలి సగం ఫన్‌గా ఉంటుంది. సెకండాఫ్‌లో ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి. స్క్రీన్‌ప్లే, స్క్రిప్ట్ చాలా బాగుంటాయి. ఇందులో నేను అభి అనే పాత్ర చేశాను. కాస్త కన్‌ఫ్యూజింగ్‌గా ఉండే పాత్ర. పూజ , కాంతం పాత్రల మధ్య నలిగిపోయే ఇన్నోసెంట్ పాత్ర. నా నిజ జీవితానికి, ఈ పాత్రకీ సంబంధం ఉండదు. అందుకే ఈ పాత్ర కోసం చాలా నేర్చుకున్నా. ప్రతి పాత్రకూ ప్రత్యేకత ఉంటుంది.
► నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర చేయడం నాకు ఇష్టమే. ఇప్పటికిప్పుడు యాక్షన్ హీరో అయిపోవాలనేం లేదు. 30 ఏళ్లలోపు వీలైనన్ని ప్రయోగాలు చేయాలని ఉంది. నటుడిగా నా వంతు కృషి చేయాలి. అందుకే ఈ సినిమా చేశా. నిహారిక చాలా స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ఉమన్. ఎవరితో ఎలా ఉండాలో తనకి తెలుసు. అలా లేకుంటే అడ్వాంటేజ్ తీసుకునేవారు చాలా మంది ఉంటారు. అలాంటి అంశాలకు తను ఎక్కడా స్కోప్ ఇవ్వదు. ఈ సినిమా తర్వాత ప్రణీత్ చాలా ఎత్తుకు ఎదుగుతాడు.
► తెలుగు, తమిళ్‌లో ఓ ద్విభాషా చిత్రం చేస్తున్నా. కన్నడ ‘కాలేజ్ కుమారా’ సినిమాకు ఇది రీమేక్. ఈ చిత్రంలో మా నాన్న పాత్రలో తెలుగులో శ్రీకాంత్‌గారు, తమిళ్‌లో ప్రభుగారు చేస్తున్నారు. ఏప్రిల్ మూడోవారం నుంచి షూటింగ్ ఉంటుంది. దీని తర్వాత మణి అనే కొత్తబ్బాయి డైరెక్షన్‌లో కిక్ బాక్సింగ్ కాన్సెప్ట్‌తో ఓ సినిమా చేస్తా. నేను కూడా నాలుగేళ్లు కిక్ బాక్సింగ్ నేర్చుకున్నా. బ్యాంకాక్‌లో మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం సంపాదించా. నాన్నగారు (విజయ్) స్టంట్ మాస్టరే అయినప్పటికీ ఆయన దగ్గర ఎప్పుడూ నేర్చుకోలేదు. నాన్నగారు కథ విని, అవసరమైతే సలహాలు ఇస్తారు. ఫైనల్‌గా నిర్ణయం మాత్రం నాదే.
Comments
Please login to add a commentAdd a comment