
వాంగో రాజ్‌తరుణ్ వాంగో !
రావోయి అతిథి అని పిలవడమే ఆలస్యం రాజ్‌తరుణ్ అభయ హస్తం ఇచ్చేస్తున్నారు. తెలుగులో ‘మజ్ను’, ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’ సినిమాల్లో అతిథిగా కనిపించారీ యువ హీరో. ఇప్పుడు తమిళ దర్శకులు వాంగో రాజ్‌తరుణ్ వాంగో అని పిలవగానే వెళ్లారు. వాంగో అంటే రండి అని అర్థం. జై, అంజలి జంటగా నటిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘బెలూన్’లో రాజ్‌తరుణ్ కీలక పాత్ర చేస్తున్నారు.
శినిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేశ్ గోవిందరాజ్ సమర్పణలో పుష్యమి ఫిలిం మేకర్స్‌పై బెల్లం రామకృష్ణారెడ్డి తెలుగులో విడుదల చేయనున్నారు. ‘‘త్వరలో ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం. ‘జర్నీ’ తర్వాత జై, అంజలి నటిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. రాజ్‌తరుణ్ పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా.