టైటిల్ : రాజా ది గ్రేట్
జానర్ : కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్
తారాగణం : రవితేజ, మెహరీన్, వివన్, రాధిక, శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ రాజ్
సంగీతం : సాయి కార్తీక్
దర్శకత్వం : అనిల్ రావిపూడి
నిర్మాత : దిల్ రాజు, శిరీష్
దాదాపు రెండేళ్ల విరామం తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ అంధుడిగా కనిపించి షాక్ ఇచ్చాడు. పటాస్, సుప్రీమ్ లాంటి వరుస హిట్స్ తో మంచి ఫాంలో ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన రాజా ది గ్రేట్ మరోసారి మాస్ మహరాజ్ స్టామినాను ప్రూవ్ చేసిందా..? రెండేళ్ల విరామం తరువాత వెండితెర మీద కనిపించిన రవితేజ, అదే స్థాయిలో అలరించాడా..? దర్శకుడు అనిల్ రావిపూడికి హ్యాట్రిక్ విజయం దక్కిందా..?
కథ :
ప్రకాష్ (ప్రకాష్ రాజ్) సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, డ్యూటీ, కూతురు లక్కీ(మెహరీన్) తప్ప మరో ప్రపంచం తెలీదు. తన కూతురి పుట్టిన రోజున తన సొంత ఊరిలో ఉత్సవాలు చేయించటం ప్రకాష్ అలవాటు. అలా ఒకసారి ఉత్సవాలకు వచ్చిన ప్రకాష్, కూతురి వచ్చే ఏడాది నీకో సర్ ప్రైజ్ ఇస్తానని మాట ఇస్తాడు. ఆ తరువాత ప్రకాష్ కు నల్లగొండ జిల్లా, భువనగిరి ప్రాంతానికి ట్రాన్స్ ఫర్ అవుతుంది. అక్కడ క్రిమినల్ దేవరాజ్ (వివన్) ఆగడాలను అడ్డుకునే ప్రయత్నంలో దేవరాజ్ తమ్ముడిని చంపేస్తాడు. అందుకు ప్రకాష్ కూతురు లక్కీ కూడా సాయం చేస్తుంది. తన ప్రాణంగా చూసుకుంటున్న తమ్ముడి చావును తట్టుకోలేని దేవరాజ్, ప్రకాష్ తో పాటు తన తమ్ముడి చావుకు కారణమైన ఆఫీసర్స్ అందరిని చంపేస్తాడు. (సాక్షి రివ్యూస్) లక్కీ మాత్రం అక్కడి నుంచి తప్పించుకుంటుంది. దేవుణ్ని బలంగా నమ్మే ప్రకాష్ తన కూతుర్ని కాపాడటానికి ఎవరో ఒకడు వస్తాడన్న నమ్మకంతో చనిపోతాడు.
రాజా (రవితేజ) పుట్టుకతోనే అంధుడు. తన కొడుకుకు కళ్లు లేకపోయినా ఏ విషయంలోనూ ఎవరికన్నా వెనకపడకూడదన్న కసితో రాజాకు చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ లాంటి వాటిల్లోనూ శిక్షణ ఇప్పుస్తుంది తల్లి అనంత లక్ష్మీ (రాధిక). తన కొడుకు ఎప్పటికైన గొప్పవాడవుతాడన్న నమ్మకంతో రాజా ది గ్రేట్ అంటూ పిలుచుకుంటుంది. రాజాను పోలీస్ ఆఫీసర్ ను చేయాలనుకున్న అనంత లక్ష్మీ, ఐజీ సంపత్ లక్కీ కాపాడేందుకు ఏర్పాటు చేసిన సీక్రెట్ మిషన్ లో రాజాకు అవకాశం ఇప్పిస్తుంది. కళ్లు లేని రాజా, లక్కీని ఎలా కాపాడాడు..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
రెండేళ్ల తరువాత వెండితెర మీద కనిపించిన రవితేజ, మరోసారి తన మాస్ అప్పీల్ కు డోకా లేదని ప్రూవ్ చేశాడు. డబుల్ ఎనర్జీతో అలరించాడు. అంధుడి పాత్రలోనూ తనదైన హాస్యం పండించి ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్ తో పాటు యాక్షన్ సీన్స్ లోనూ తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. హీరోయిన్ గా మెహరీన్ అందంగా కనిపించింది. ఎమోషనల్ సీన్స్ లో మంచి నటన కనబరిచింది. విలన్ గా వివన్, రవితేజతో పోటి పడి అలరించాడు. రాక్షసుడిలా కనిపిస్తూనే కామెడీ పండించటంలోనూ సక్సెస్ అయ్యాడు. స్టైలిష్ విలన్ గా వివన్ కు మరిన్ని అవకాశాలు రావటం ఖాయం.(సాక్షి రివ్యూస్) బుల్లితెర మీద ఎక్కువగా హుందాగా కనిపించే పాత్రలు మాత్రమే చేస్తున్న రాధిక వెండితెర మీద మాత్రం మంచి ఎంటర్ టైనింగ్ రోల్ లో అలరించింది. కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించింది. క్లైమాక్స్ లో రాధిక అనుభవం, నటన.. సీన్స్ మరింత ఎలివేట్ అయ్యేలా చేశాయి. హీరో ఫ్రెండ్ గా శ్రీనివాస్ రెడ్డి మరోసారి తనదైన నటనతో అలరించాడు. ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, సంపత్, తనికెళ్ల భరణి తన పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణులు :
మాస్ ఇమేజ్ ఉన్న హీరోను అంధుడి పాత్రలో చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి మంచి విజయం సాధించాడు. హీరో అంధుడైనా.. కమర్షియల్ ఎలిమెంట్స్ కు ఏ మాత్రం డోకా లేకుండా పక్కా మాస్ మసాలా ఎంటర్ టైనర్ లా సినిమాను నడిపించాడు. తొలి అర్థభాగం ఫుల్ ఎంటర్ టైనింగ్ గా నడిపించిన దర్శకుడు, సెకండ్ హాఫ్ లో కాస్త నెమ్మదిగా కథ నడిపించి బోర్ కొట్టించాడు. అయితే కథ పరంగా కొత్తదనం లేకపోయినా. కథనంతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ప్రతీ సీన్ లోనూ కామెడీ పండిచటంలో సక్సెస్ సాధించిన అనిల్, హ్యాట్రిక్ విజయాన్ని సాధించాడనే చెప్పాలి. (సాక్షి రివ్యూస్) మెహన్ కృష్ణ సినిమాటోగ్రఫి సినిమాకు మరో ప్లస్ పాయింట్. డార్జిలింగ్ లో తీసిన సన్నివేశాలు చాలా అందంగా రిచ్ గా ఉన్నాయి. యాక్షన్ సీన్స్ లోనూ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. సాయి కార్తీక్ అందించిన పాటలు పెద్దగా గుర్తుండక పోయినా.. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్ధాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
రవితేజ నటన
కామెడీ
స్క్రీన్ ప్లే
మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్ లెంగ్త్
ఓవరాల్ గా రాజా ది గ్రేట్ ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తాడు..
- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment