మహాభారతాన్ని తప్పకుండా తెరకెక్కిస్తా : రాజమౌళి
బాహుబలి 2 రిలీజ్ కు రెడీ కావటంతో రాజమౌళి చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ పై చర్య మొదలైంది. గతంలో పలు సందర్భాల్లో తాను మహాభారతాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నానని రాజమౌళి చెప్పటంతో బాహుబలి తరువాత మహాభారతమే సెట్స్ మీదకు వెళ్తుందని భావించారు. అయితే రాజమౌళి మాత్రం మహాభారతానికి తెర రూపం ఇచ్చేంత అనుభవం తనకింకా రాలేదని అందుకు ఇంకా సమయం పడుతుందని చెపుతూ వస్తున్నాడు.
తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ 1000 కోట్ల తో మహాభారతాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించటంతో మరోసారి రాజమౌళి మహాభారతం చర్చకు వచ్చింది. మోహన్ లాల్ అంత భారీగా రూపొందించిన తరువాత తిరిగి రాజమౌళి అదే కథను తీస్తాడా అన్న అనుమానం వ్యక్తం అయ్యింది. అయితే ప్రస్తుతం బాహుబలి 2 ప్రమోషన్ లో బిజీగా ఉన్న జక్కన మహాభారతం తీసే ఆలోచనపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు.
తాను తప్పకుండా మహాభారతాన్ని తెరకెక్కిస్తానని చెప్పాడు. అయితే అదే మరో ఏడాదిలోనా.. లేక పదేళ్ల తరువాతనా అన్న విషయం మాత్రం ఇప్పుడే చెప్పలేనని తెలిపాడు. మహాభారతం మహాసముద్రమన్న జక్కన అందులో మోహన్ లాల్ టీం కొంత తీస్తే నేను కొంత తీస్తానని అలా ఎంతమందైనా చేయోచ్చని తెలిపాడు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి.