
‘‘ఒకప్పుడు తెలుగు చిత్రాలు చూసేవాణ్ణి. విలువలతో కూడిన ఆ చిత్రాల ప్రభావం సమాజంపై ఉండేది. ఇప్పటి చిత్రాల టైటిల్స్ తెలుగుని మరచిపోయేలా చేస్తున్నాయి. ఈ చిత్రానికి తెలుగులో టైటిల్ పెట్టడం నాకు నచ్చింది.’’ అన్నారు తమిళనాడు మాజీ గవర్నర్ కె. రోశయ్య. దినేశ్, మియా జార్జ్, నివేథా పేతురాజ్, రిత్విక ముఖ్యతారలుగా నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘ఒరు నాల్ కొత్తు’.
తెలుగులో ‘పెళ్లిరోజు’ పేరుతో బల్లా సురేశ్, మృదుల మంగిశెట్టి, ప్రవీణ్ మంగిశెట్టి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం పాటల్ని రోశయ్య, లోగోను సీనియర్ నటి జమున ఆవిష్కరించారు. ‘‘యాభై ఏళ్ల క్రితం ‘పెళ్లిరోజు’ అనే చిత్రంలో నటించాను’’ అన్నారు జమున. ‘‘పెళ్లికోసం ఆరాటపడే ముగ్గురు యువతుల కథే ఈ సినిమా. కొన్ని మార్పులతో తెలుగులో విడుదల చేస్తున్నాం’’ అన్నారు వెంకటేశన్.