
రాజేష్ శ్రీ చక్రవర్తి
ప్రముఖ సంగీత దర్శకులు చక్రవర్తి మనవడు రాజేష్ శ్రీ చక్రవర్తి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘శివకాశీపురం’. ఇందులో ప్రియాంకా శర్మ కథానాయికగా నటించారు. హరీష్ వట్టికూటి దర్శకత్వంలో మాస్టర్ హరి సమర్పణలో సాయి హరీశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై మోహన్‌బాబు పులిమామిడి నిర్మించారు. నేడు ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ– ‘‘నేను హీరో అవ్వడం మా నాన్నగారి (సంగీత దర్శకుడు శ్రీ) ఆశ. నన్ను హీరోగా లాంచ్ చేసే ప్రయత్నాలు చాలా జరిగాయి. ఈ టైమ్‌లోనే ఆయన మాకు దూరమవడంతో ఆ ప్రయత్నాలకు బ్రేక్స్ పడ్డాయి.
మా తాతగారు, నాన్నగారు మ్యూజిక్ డైరెక్టర్స్ అయినప్పటికీ నన్ను నేను నటుడిగా ప్రూవ్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నాను. ‘కల్యాణ వైభోగమే’ సినిమాకు నందినీరెడ్డిగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. వైజాగ్ సత్యానంద్‌గారి దగ్గర యాక్టింగ్ కోర్స్ చేశా. ‘నువ్వు చాలా హాట్ గురూ’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించాను. ఇప్పుడు ‘శివకాశీపురం’ సినిమాలో హీరోగా చేశాను. మూఢ నమ్మకాల అంశాలతో గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్న ఓ ఆటోడ్రైవర్ క్యారెక్టర్ చేశాను. మంచి సినిమా చేశాం. ఆదరిస్తారనే నమ్మకం ఉంది. మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ తర్వాత కమిట్ అవుదాం అనుకుంటున్నాను’’ అన్నారు.