
రజనీకాంత్
చెన్నై,పెరంబూరు: రాష్ట్రంలో డెంగీ జ్వరాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ వ్యాధితో మరణాలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో నటుడు రజనీకాంత్ డెంగీ బారి నుంచి ప్రజలను రక్షించడానికి నేలవేమ కషాయాన్ని ఉచితంగా అందించాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు. దర్బార్ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసిన రజనీకాంత్ ఈ నెల 13న ఆధ్యాత్మిక బాట పట్టి హిమాలయలకు వెళ్లారు. ఐదు రోజుల పాటు ఆధ్యాత్మిక పయనాన్ని ముగించుకుని శనివారం చెన్నైకి తిరిగొచ్చారు. ఈ సందర్భంగా ఆయన చెన్నై విమానాశ్రయంలో వీడియాతో మాట్లాడారు. ఆధ్యాత్మక పయనం విజయవంతంగా ముగిసిందని తెలిపారు. అదే విధంగా దర్బార్ చిత్రం చాలా బాగా వచ్చిందని తెలిపారు.
అయోమయంలో అభిమానులు
కాగా రజనీకాంత్ దర్బార్ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత రాజకీయాలపై దృష్టిసారిస్తారని, రాజకీయ పార్టీని ప్రారంభిస్తారని ఆయన అభిమానులు భావించారు. అలాలటిది దర్బార్ చిత్రం తరువాత రజనీకాంత్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించడం, రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు మరో ఏడాదిన్నలో జరగనుండటంతో రజనీ రాజకీయ రంగప్రవేశంపై ఆయన అభిమానులు అయోమయంలో పడ్డారు. చాలా నిరాశకు గురవుతున్నారు. అయితే ఈ విషయం గురించి రజనీకాంత్ సన్నిహితులు తలైవా రాజకీయాల్లోకి రావడం పక్కా అని భరోసా ఇస్తున్నారు. రజనీకాంత్ త్వరలో శివ దర్శకత్వంలో తన 168వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారని, ఆ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత లేదా చిత్ర విడుదల సమయంలో రాజకీయ పార్టీని ప్రారంభిస్తారని తెలిపారు. శాసనసభ ఎన్నికలకు ఏడాది ముందుగాని లేదా ఆరు నెలల ముందుగాని రాజకీయ పార్టీని ప్రకటిస్తారని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment