చెన్నై ,పెరంబూరు: సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే నటుడు రజనీకాంత్. ఎప్పుడైతే రాజకీయ రంగప్రవేశానికి సిద్ధం అన్నారో అప్పుటి నుంచే ఆయన వివాదాలకు కేంద్రంగా మారారు. ఇటీవల రజనీకాంత్ పేరియార్ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వ్యతిరేకతకు గురిచేస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో రజనీకాంత్‌కు కొందరు రాజకీయనాయకుల నుంచి మద్దతు కూడా లభించడం గమనార్హం. ఇప్పటికే రజనీకాంత్‌పై తిరుచ్చిలో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు నమోదైంది. తాజాగా సేలంలో కూడా ఫిర్యాదు నమోదైంది. కాగా ఈ వ్యవహారంలో ఎవరెలా స్పందిస్తున్నారో చూద్దాం..
రజనీ వివరణ ఇవ్వాలి
పెరియార్ గురించి చేసిన వ్యాఖ్యలపై నటుడు రజనీకాంత్ వివరణ ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖామంత్రి సెంగోట్టయన్ డిమాండ్ చేశారు. ఈయన ఆదివారం ఈరోడ్డులోని గోపి బస్టాండ్ సమీపంలో పోలియో చుక్కల శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పెరియార్ గురించి రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందనపై మీడియా ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఆ వ్యాఖ్యలపై రజనీకాంత్‌నే వివరణ ఇవ్వాలని అన్నారు.
భేషరతుగా క్షమాపణ చెప్పాలి
కాగా ద్రావిడ విడుదలై కళగం అధ్యక్షుడు కొలత్తూర్ మణితంజైలో విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ తమిళనాడులో అనవసర చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. సినీ నటీనటులను తమ పార్టీలోకి లాక్కునే ప్రయత్నం చేస్తోందన్నారు. అందులో భాగంగా ఇటీవల నటుడు రజనీకాంత్ పెరియార్ గురించి చేసిన వ్యాఖ్యలు అని అన్నారు. ముగ్గులు వేసేవారిపైనా, పుస్తకాల ప్రదర్శనలను ఏర్పాటు చేసేవారిపైన చర్యలు తీసుకుంటున్నారని, మరి నటుడు రజనీకాంత్‌పై ఎందుకు చర్చలు తీసుకోవడం లేని ప్రశ్నంచారు. పెరియార్ భావాలను ఆదరించేవారు పలువురు పోరాటాలకు సిద్ధం అవుతున్నారని, ఇప్పటికే పలుచోట్ల రజనీకాంత్‌పై ఫిర్యాదులు నమోదయ్యాయని అన్నారు. కాబట్టి పెరియార్ వ్యవహారంలో రజనీకాంత్ భేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
హెచ్.రాజా మద్దతు
కాగా పెరియార్ వ్యవహారంలో నటుడు రజనీకాంత్‌కు బీజేపీ అండగా నిలుస్తోంది. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా రజనీకాంత్ వ్యాఖ్యలను సమర్థించారు. ఈయన ఆదివారం కాంచీపురంలోని దేవాలయంలో దైవదర్శనం చేసుకున్నారు. అనంతరం ఆమన మీడియాతో మాట్లాడుతూ పెరియార్ వ్యవహారంలో నటుడు రజనీకాంత్ వాస్తవాన్నే చెప్పారని అన్నారు. తాటాకు చప్పుళ్లకు రజనీకాంత్ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అదేవిధంగా బీజేపీ మాజీ అధ్యక్షుడు కేఎన్.లక్ష్మణన్ కూడా రజనీకాంత్ వ్యాఖ్యలను సమర్థించారు.
రజనీకాంత్‌పై ఫిర్యాదు
కాగా నటుడు రజనీకాంత్‌పై ఇప్పుటికే పలు పాంత్రాల్లో ఫిర్యాదులు నమోదవుతున్నాయి. తాజాగా సేలంలో ఆయనపై మరో ఫిర్యాదు నమోదైంది. ద్రావిడ విడుదలై కళగం సేలం తూర్పు జిల్లా అధ్యక్షుడు శక్తివేల్ సేలం ఎస్‌పీ కార్యాలయంలో రజనీకాంత్‌పై ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment