అభిమానులు లేనిదే హీరోలు లేరులే.. అన్న పాట రజనీకాంత్ నటించిన కుచేలన్ చిత్రంలో ఉంది. దీన్ని ఎంత మంది హీరోలు గ్రహిస్తారో గానీ, నటుడు రజనీకాంత్‌కు ఈ విషయం బాగా తెలుసు. అందుకే ఆయన తరచూ తన అభిమానులను కలిసి వారికి సంతోషాన్ని కలిగిస్తుంటారు. నాగర్‌కోవిల్ సమీపంలోని కోట్టార్ వాగైయడి గ్రామానికి చెందిన అవినాష్ అనే 12 ఏళ్ల బాలుడు రజనీకాంత్‌కు వీరాభిమాని. 7వ తరగతి చదువుతున్న ఆ బాలుడు రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతని తల్లితండ్రులు స్వామినాథన్, లత కుమారుడి అవయవాలను దానం చేశారు.
అవినాష్ తన అభిమాన నటుడు రజనీకాంత్ చిత్ర పటాన్ని పెన్సిల్‌తో చెక్కాడు. ఆ ఫొటోను రజనీకాంత్‌కు చూపించి దానిపై ఆయన సంతకం చేయించుకోవాలని ఆశ పడ్డాడు. ఆ కోరిక నెరవేకుండానే దుర్మరణం పాలయ్యాడు. తమ కుమారుడి ఆశను ఎలాగైనా నెరవేర్చాలని అతని తల్లిదండ్రులు భావించారు. ఈ విషయాన్ని ఒక లేఖ ద్వారా రజనీకాంత్‌కు తెలియజేశారు.
ఆ లేఖ చదివిన రజనీకాంత్ ఇటీవల అవినాష్ తల్లిదండ్రులను ఇంటికి పిలిపించుకుని ఓదార్చారు. ఈ సందర్భంగా వారు తమతో తీసుకొచ్చిన చిత్రపటాన్ని చూపించగా అందులో రజనీకాంత్ సంతకం చేశారు. అవయవదానం చేసిన మీ కుమారుడు ఎప్పటికీ సజీవంగానే ఉంటాడని చెప్పి పంపారు. ఈ విషయం తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడి కోరికను నెరవేర్చామన్నారు. ఇప్పుడు ఆత్మశాంతిస్తుందని భావిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment