
మామ హీరో... అల్లుడు నిర్మాత
మామ ఏమో సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్.. విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న అల్లుడు కూడా మామకు తగ్గవాడే. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి ఓ చిత్రం చేయనున్నారు. కలిసి అంటే ఇద్దరూ ఆన్ స్క్రీన్‌పై కాదు. మామ ఏమో ఆన్ స్క్రీన్. అల్లుడేమో ఆఫ్ స్క్రీన్. యస్.. మామగారు రజనీకాంత్ నటించే చిత్రాన్ని అల్లుడుగారు ధనుష్ నిర్మించనున్నారు. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కబాలి’తో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చారు రజనీ. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘రోబోకు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘2.0’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారీ సూపర్‌స్టార్.
ఆ తర్వాత ఆయన ఎవరి దర్శకత్వంలో నటిస్తారు? అనే ప్రశ్నలకు ఫుల్‌స్టాప్ పెట్టారు ధనుష్. ‘కబాలి’ చిత్రాన్ని రూపొందించిన పా.రంజిత్ దర్శకత్వంలోనే మావయ్య హీరోగా, తాను నిర్మాతగా కొత్త చిత్రం ఉంటుందని ధనుష్ పేర్కొన్నారు. సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై దీన్ని నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉందని ఆయన చెప్పారు. ‘2.0’ పూర్తయ్యాక ఈ కొత్త చిత్రం పట్టాలెక్కనుంది.