
రజనీకాంత్ అసలు రహస్యం చెప్పారు
చెన్నై: తనపై గత కొంతకాలంగా వస్తున్న ఊహగానాలకు ప్రముఖ దక్షిణాది నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ తెరదించారు. ఆయన అమెరికా టూర్ వెనుక రహస్యాన్ని స్వయంగా ఓ లేఖలో వెల్లడించారు. దాదాపు రెండు నెలలపాటు అమెరికాలో ఆయన ఎందుకు ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా లేదా అసలు ఏం జరుగుతుందని అటు అభిమానులతోపాటు సినీ వర్గాల్లో సైతం తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఓ లేఖలో అందరికీ సమాధానం చెప్పారు.
అందులో ఆయన ఏం చెప్పారంటే.. 'నేను శంకర్ దర్శకత్వం వహిస్తున్న 2.0(రోబో 2) చిత్రం, భావోద్వేగాలు, విప్లవాత్మక అంశాలు నిండిన చిత్రం 'కబాలీ' షూటింగ్లలో వరుసగా పాల్గొన్నాను. దీనివల్ల, కొంత మానసికంగా, శారీరకంగా అలసిపోయాను. దాని నుంచి ఉపశమనం పొందేందుకు విశ్రాంతి అవసరం అని అర్థమైంది. అందుకే నా కూతురు ఐశ్వర్య ధనుష్ తో కలిసి రెండు నెలలపాటు అమెరికా టూర్ కు వెళ్లాను. అక్కడే వైద్య పరీక్షలు కూడా పూర్తి చేసుకున్నాను.
ఇప్పుడు నా మాతృదేశానికి వచ్చాక మళ్లీ కొత్త బలం వచ్చింది. కబాలీ చిత్రం విజయం గురించి విన్నాక మనసు మరింత ప్రశాంతంగా మారింది. ఈ సందర్భంగా నా చిరకాల మిత్రుడు థనుకు, చిత్ర దర్శకుడు రంజిత్ కు మొత్తం చిత్ర యూనిట్కు ధన్యవాదాలు చెబుతున్నాను. అలాగే, నా ప్రియమైన అభిమానులకు, ప్రజలకు, మీడియా మిత్రులకు, థియేటర్ల యజమానులకు, పంపిణీదారులకు కూడా పదేపదే ధన్యవాదాలు చెబుతున్నాను' అంటూ రజినీ స్వయంగా లేఖలో రాశారు.