
అప్పటి కన్నడ హిట్‌కు ఇప్పుడు రీమేక్?
బెంగళూర్‌లో బస్ కండక్టర్‌గా చేసినప్పుడు ఎంత నిరాడంబరంగా ఉండేవారో సూపర్ స్టారయ్యాక రజనీకాంత్ అలానే ఉంటున్నారు. అప్పట్లో ఆయన కన్నడ చిత్రాలను చూస్తుండేవారట. అలా చూసినవాటిలో స్వర్గీయ కన్నడ రాజ్‌కుమార్ నటించిన ‘బంగారద మనుష్య’ ఒకటి. 1972లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ చిత్రాన్ని ఎప్పటికైనా రీమేక్ చేయాలని రజనీ ఆలోచన. రాజ్‌కుమార్ చేసిన పాత్ర విపరీతంగా నచ్చిందని, ఆ పాత్రచేయాలని రజనీకి ఉందని ఆయన ఆప్తమిత్రుడు రాజ్ బహదూర్ ఇటీవల ఓ సందర్భంలో తెలిపారు. వాస్తవానికి ‘లింగా’కన్నా ముందే రజనీ ఈ చిత్రంలోనే నటించాల్సి ఉందట.
అయితే అప్పటికే ‘లింగా’కి డేట్స్ కేటాయించేయడంతో ఆ రీమేక్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారని బహదూర్ అంటున్నారు. ఈ నేపథ్యంలో ‘లింగా’ తర్వాత రజనీ నటించే చిత్రం ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ‘లింగా’కి దర్శకత్వం వహిస్తున్న కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలోనే రజనీకి ఈ సినిమా చేయాలని ఉందట. ఏదేమైనా, నలభై ఏళ్ల క్రితం చిత్రాన్ని ఇప్పుడు రీమేక్ చేయాలని రజనీ అనుకుంటున్నారంటే.. అదెంత గొప్పగా ఉంటుందో ఊహించుకోవచ్చు.