
రజనీకాంత్ చిత్రం రీమేక్‌లో ఆర్య?
సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రాలను రీమేక్ చేయడం,ఆయన చిత్రాల పేర్లను వాడుకోవడం కోలీవుడ్‌లో ఒక ట్రెండ్‌గా మారిందని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే ఆయన క్రేజ్‌ను వాడుకుంటున్నారనవచ్చు. అయితే అజిత్ నటించిన బిల్లా లాంటి అతి తక్కువ చిత్రాలే విజయం సాధించాయి. తాజాగా రజనీకాంత్ నటించిన మరో చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. చాలా కాలం ముందు రజనీకాంత్ నటించిన సూపర్‌హిట్ చిత్రం పాండియన్.
సీనియర్ దర్శకుడు ఎస్పీ ముత్తురామన్, రజనీకాంత్‌ల కాంబినేషన్‌లో వచ్చిన చివరి చిత్రం పాండియన్. ఇప్పుడీ చిత్ర రీమేక్‌లో యువ నటుడు ఆర్య నటించడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. దీనికి సురాజ్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఇటీవల జయంరవి హీరోగా కమలహాసన్ చిత్రం సకలకళావల్లవన్ పేరును వాడుకుని చిత్రం రూపొందించిన ఈయన అంతకు ముందు రజనీకాంత్ చిత్ర టైటిల్ పడిక్కాదవన్‌తో ధనుష్ కథానాయకుడుగా చిత్రం చేశారన్నది గమనార్హం.
సకలకళావల్లవన్ చిత్రాన్ని నిర్మించిన లక్ష్మీ మూవీ మేకర్స్ సంస్థే పాండియన్ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ టాక్. ఆర్య ఇటీవల నటించిన యట్చన్,వాసువుమ్ శరవణన్, ఇంజి ఇడుప్పళగి చిత్రాలు ఆశించి స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో రజనీకాంత్ చిత్ర రీమేక్‌తోనైనా హిట్ కొట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.