
హెల్త్ చెకప్ చేయించుకున్న సూపర్ స్టార్!
చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ సోమవారం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సాధారణ వైద్యపరీక్షలు చేయించుకున్నారు. తన తాజా సినిమా 'కబాలి' కోసం మలేషియాలో నిర్విరామంగా షూటింగ్ లో పాల్గొన్న నేపథ్యంలో చెన్నైకి తిరిగి వచ్చిన వెంటనే హెల్త్ చెకప్ చేయించుకున్నారు.
'ఆయన కూతురుతో కలిసి సోమవారం ఉదయం ఎంఐఓటీ ఆసుపత్రికి వచ్చారు. అక్కడ ఆయనకు ఓ ప్రత్యేక వార్డు కేటాయించాం. ఇందులో సాధారణ వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం సాయంత్రం ఆయనను డిశ్చార్జ్ చేశాం' అని వైద్యులు తెలిపారు. 65 ఏళ్ల రజనీకాంత్‌కి వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు తెలిసింది.
రజనీ ప్రస్తుతం బిజీబిజీ షెడ్యూల్‌తో ఉన్నారు. 'కబాలి' సినిమా ముగిసీముగియకముందే.. ఆయన డైరెక్టర్ శంకర్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రోబో-2 (2.0)లో నటించనున్నారు. 'రోబో' సీక్వెల్‌గా భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ విలన్‌గా దక్షిణాదిలో ఎంట్రీ ఇవ్వనున్నాడు.