వెండితెరకు రజనీ జీవితం
శివాజీరావు గైక్వాడ్... ఓ ఆర్డినరీ బస్ కండక్టర్. యాక్టింగ్ అంటే ఆసక్తి. కానీ, ఆరడుగుల ఎత్తు లేడు.. ఆజానుబాహుడు కాదు.. ఆకర్షించే రూపం లేదు. రంగు.. ఎండలోకెళితే ట్యాన్ అయిపోతానేమోనని కంగారు పడాల్సిన అవసరమే లేదు. నలుపు రంగు. అయినా కళకు తక్కువ లేదు. స్టైల్ సూపర్. అందుకే సూపర్‌స్టార్ రజనీకాంత్ అయ్యాడు. ఆరు పదుల వయసులోనూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాడు.
హీరోగా హిమాలయాలంత ఎత్తుకు ఎదిగినా నిజ జీవితంలో హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉంటారు రజనీ. తనను తాను సామాన్యుడిగా భావిస్తారు. ఓ కమర్షియల్ సినిమాకి అవసరమైన మలుపులు, హంగులన్నీ రజనీకాంత్ జీవితంలో ఉన్నాయి. అందుకే ఆయన జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రజనీ రెండో కుమార్తె సౌందర్య ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
‘‘ప్రస్తుతం ఐశ్వర్య (రజనీ పెద్ద కూతురు) నాన్న జీవితం మీద పుస్తకం రాస్తోంది. తర్వాతి అడుగు సినిమా తీయడమే. నాన్న జీవితంలో ఎవ్వరికీ తెలియని చాలా విషయాలు ఈ సినిమాలో చూపించబోతున్నాం. స్ఫూర్తిమంతంగా ఉంటుందీ సినిమా. కూతురిగా, వీరాభిమానిగా మా నాన్న జీవితాన్ని వెండితెరపై చూడాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’’ అని సౌందర్యా రజనీకాంత్ పేర్కొన్నారు.