
ప్రముఖ నటి రష్మికా మందన్నాతో బ్రేకప్ గురించి కన్నడ నటుడు రక్షిత్ శెట్టి స్పందించారు. తన తాజా చిత్రం అతడే శ్రీమన్నారాయణ ప్రమోషన్‌లో పాల్గొన్న రక్షిత్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సందర్భంగా రక్షిత్‌కు తన మాజీ ప్రేయసి రష్మిక గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ ‘ఆమె చాలా పెద్ద కలలు కనింది. ఆమె గతం నాకు తెలుసు కాబట్టి.. ఆ కలలు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా తెలుసు. ఆమె కలలు నిజం కావాలని దేవున్ని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.
కాగా, కిరిక్ పార్టీ చిత్రంలో నటిస్తున్న సమయంలో రష్మిక, రక్షిత్‌ల మధ్య ప్రేమ చిగురించింది. 2017లో రష్మిక, రక్షిత్‌ల నిశ్చితార్థం జరగగా.. ఆ మరసుటి ఏడాదే వారిద్దరు విడిపోయారు. ఆ సమయంలో ఆయన అభిమానులు రష్మికను లక్ష్యంగా చేసుకుని కామెంట్లు చేయడంతో రక్షిత్ స్పందించారు. ‘రష్మికా గురించి మీరు ఓ అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నారు. ఎవర్ని నేను తప్పుపట్టను. మనం ఏం చూస్తున్నామో అదే అందరం నమ్ముతుంటాం. కానీ అవి నిజం కాకపోవచ్చు. చాలా సార్లు మనం మరో వైపు ఉన్న కోణాన్ని చూడకుండానే, నిర్ధారణకు వచ్చేస్తుంటాం. నాకు రష్మిక రెండున్నరేళ్లకు పైగా తెలుసు. మీ కంటే ఎక్కువ రష్మిక గురించి నాకే తెలుసు. దయచేసి ఆమెను జడ్జి చేయడం ఆపండి’ అని కోరారు. మరోవైపు హీరో విజయ దేవరకొండతో రష్మిక ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చినప్పటికీ.. ఆమె వాటిని ఖండించారు. కాగా, రక్షిత్ అతడే శ్రీమన్నారాయణ చిత్రం కన్నడలో డిసెంబర్ 27న, తెలుగులో జనవరి 1న, తమిళ్, మాలయాళంలో జనవరి 3న, హిందీలో జనవరి 16న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment