
తమిళసినిమా: ఆమెక్కడ.. నేనెక్కడ అంటోంది నటి రకుల్‌ప్రీత్‌సింగ్. అసలు ఈ అమ్మడి కథేంటో చూద్దామా‘ రకుల్ ఇప్పుడు ఆనందంలో మునిగితేలిపోతోంది. కోలీవుడ్‌లో చాలా కాలంగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన విజయం ధీరన్ అధికారం ఒండ్రు చిత్రంతో సొంతమైంది. ఇది ఈ బ్యూటీ చాలా ఏళ్ల కల అనే చెప్పాలి. మొదట్లో ఇలాంటి విజయాన్ని ఆశించి నిరాశపడిన రకుల్‌ప్రీత్‌సింగ్ టాలీవుడ్‌కు తరలి వెళ్లింది. అదృష్టం కలిసొచ్చి అక్కడ సక్సెస్ అయ్యింది.అయితే ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబుతో నటించిన స్పైడర్ చిత్రంపై కన్న కలలు కల్లలుగానే మారాయి.దీంతో కార్తీతో రొమాన్స్ చేసిన ధీరన్ అధికారం ఒండ్రు రకుల్‌ప్రీత్‌సింగ్ కెరీర్‌కు చాలా కీలకంగా మారింది. ఎందుకంటే టాలీవుడ్‌లోనూ ప్రస్తుతం అవకాశాలు లేవు.
తమిళంలో విజయ్‌కు జంటగా నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నా, అందులో స్పష్టత లేదు. ఇక స్యూర సరసన సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారంలో ఉన్నా, అది ఎప్పుడు సెట్‌పైకి వెళుతుందో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో ధీరన్ అధికారం ఒండ్రు చిత్ర విజయం రకుల్‌ప్రీత్‌సింగ్‌కు నూతనోత్సాహానిచ్చిందనే చెప్పాలి. దీంతో తదుపరి నయనతార నువ్వేనా? అన్న ప్రశ్నకు ఆమె ఎక్కడ, తానెక్కడ నయనతారతో తనను పోల్చకండి అని టక్కున బదులిచ్చింది. నయనతార మంచి మంచి కథా చిత్రాల్లో నటిస్తూ ఉన్నత స్థాయిలో రాణిస్తున్నారని, తాను ఇప్పుడే ఎదుగుతున్న నటిని అని పేర్కొంది. నటిగా ఇంకా చాలా దూరం పయనించాలి. అయితే తానూ నయనతార తరహాలో నటనకు అవకాశం ఉన్న కథా చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నానని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment