
సినిమా: సినిమా మారుతోందని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మార్పు మంచిదే అని చెప్పకతప్పదు. ముఖ్యంగా సాంకేతికపరంగా సినిమా ఎంతో అభివృద్ధి చెందుతోంది. దానితో పాటు సంప్రదాయ కట్టుబాట్లకు తిలోదకాలు ఇవ్వడం అధికం అవుతోంది. ఇక అసలు విషయానికి వస్తే హీరోయిన్ల అందాలారబోత పరిధులు దాటుతోంది. అదే మంటే ప్రేక్షకులు స్వాగతిస్తున్నారు, మేము అందిస్తున్నామని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కథ డిమాండ్ కారణంగానే అలా నటించాల్సి వస్తోందని హీరోయిన్లు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లని అని తప్పులేదు. నిజానికి గ్లామరస్‌గా నటిస్తేనే వారికి వరసగా అవకాశాలు వస్తాయి. అందుకే మేం గ్లామర్‌కు దూరం అని మడిగట్టుకుని కూర్చున్న వారు కూడా ఇప్పుడు తాము సైతం అనక తప్పడం లేదు. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ బ్యూటీల రాక అధికం కావడంతోనే గ్లామర్‌లోనే శృతి మించడం మొదలైందని చెప్పక తప్పదు.
ఒకప్పటి వ్యాంప్ పాత్రలు ఇప్పుడు హీరోయిన్ పాత్రలుగా మారిపోయాయి. అదే విధంగా ఇప్పుడు శృంగార తారల అవసరం లేకపోయ్యింది. హీరోయిన్లే ఆ తరహా పాటల్లో నటించేస్తున్నారు. అందుకు అధిక పారితోషికం ముట్టడమే ప్రధాన కారణం అయినా, వారు మాత్రం వేరే అర్థాలను చెబుతున్నారు. మీల్కీబ్యూటీ తమన్న గ్లామర్ పాత్రలకు ఎప్పుడో సై అనేసింది. కాజల్ అగర్వాల్, శ్రియ, పూజా హెగ్డే, క్యాథరిన్ ట్రెసా ఇలా చాలా మంది ఐటమ్‌సాంగ్‌కు రెడీ అంటున్నారు. మరో బాలీవుడ్ దిగుమతి నటి రకుల్‌ప్రీత్‌సింగ్ కూడా ఐటమ్ సాంగ్‌లో నటించడంలో తప్పేంటో తనకు అర్థం కావడం లేదంటోంది. ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న కన్నడ చిత్రం కేజీఎఫ్‌లో నటి తమన్న ఐటమ్ సాంగ్‌తో అదరగొట్టింది. అయితే ఆ పాటలో నటించే అవకాశం ముందు నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌కు వచ్చిందని, తను నో అనడంతో తమన్న ఎస్ అందనే ప్రచారం సాగుతోంది. దీన్ని ఖండించిన రకుల్‌ప్రీత్‌సింగ్ కేజీఎఫ్ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసే అవకాశం తనకు రాలేదని, వస్తే నేనోద్దంటానా? అయినా అలాంటి సాంగ్స్‌లో నటించడంలో తప్పేంటి అనీ అమ్మడు ప్రశ్నిస్తోంది.