అలాంటి ఛాన్స్ రాలేదు!
‘‘నటిగా నా వృత్తి ఏంటి? ఓ పాత్రలో నటించడమే. పెద్ద హీరో అయినా.. చిన్న హీరో అయినా.. నా పాత్ర, కథ బాగుంటే చేస్తాను. ‘బాహుబలి’తో తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరుకుంది. హాలీవుడ్‌లో ఓ పాత్రను పాత్రగానే చూస్తారు. ఏంజెలీనా జోలీ ‘టూంబ్ రైడర్’ చేసింది. ‘మిస్టర్ అండ్ మిస్సెస్’, ‘సాల్ట్’ వంటి డిఫరెంట్’ సినిమాలూ చేసింది. తెలుగులోనూ అలా చేసే అవకాశాలు రావాలి. యాక్షన్, రొమాన్స్, లవ్.. అంటూ నటీనటులకు పరిమితులు ఉండకూడదు’’ అన్నారు రకుల్‌ప్రీత్ సింగ్. సాయిధరమ్ తేజ్, రకుల్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మించిన సినిమా ‘విన్నర్’. ఈ శుక్రవారం విడుదలవుతున్న ఈ సినిమా గురించి రకుల్ చెప్పిన సంగతులు...
► ఈ సినిమాలో నా పేరు సితార. ఓ అథ్లెటిక్. రన్నింగ్, జంపింగ్ కాంపిటీషన్‌లలో ఓ మెడల్ నెగ్గాలనేది సితార లక్ష్యం. ‘నాకో లక్ష్యం ఉంది. నీకు ఏ లక్ష్యం లేదా?’ అని హీరోను తిడుతుంటుంది. ప్రేమకు టైమ్ లేదనే క్యారెక్టర్ అన్నమాట. నా రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉండే పాత్ర. సితార వల్లే సిద్ధు (హీరో) హార్స్ జాకీ అవుతాడు. అంతకు మించి చెబితే కథ అందరికీ తెలుస్తుంది.
► హీరోలు హార్స్ రైడింగ్, గట్రా చేయడం చాలా సినిమాల్లో చూశాం. కానీ, ఇప్పటివరకూ తెలుగులోనే కాదు.. హిందీలో కూడా హీరోలెవరూ హార్స్ జాకీగా నటించలేదు. ఇందులో హార్స్ జాకీ కావాలనే లక్ష్యంతో హీరో పాత్ర ఉంటుంది. టర్కీలో చిత్రీకరించిన హార్స్ రైడింగ్ సీన్లు చాలా కొత్తగా, లావిష్‌గా ఉంటాయి.
► ఓ దర్శకుడితో రెండో సినిమా చేస్తున్నప్పుడు... వాళ్ల మీటర్ తెలుసు కనుక మన వర్క్ ఈజీ అవుతుంది. ‘పండగ చేస్కో’ తర్వాత గోపీచంద్ మలినేనితో పనిచేసే ఛాన్స్ వచ్చింది. తేజూ కూడా ఫ్రెండ్ కావడంతో చిత్రీకరణ అంతా సరదాగా సాగింది. పక్కా కమర్షియల్, ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి. సినిమా చూసినప్పుడు తేజూ ఏడ్చేశానని చెప్పాడు. ప్రేక్షకులకూ అవి నచ్చుతాయి.
► హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలంటే హారర్, థ్రిల్లర్స్ కాదు. మహిళలకు మంచి ప్రాముఖ్యత ఉన్న సినిమాలూ ఉంటాయి. నాకు ఇప్పటివరకూ అలాంటి ఛాన్సులు రాలేదు. వస్తే చేయడానికి రెడీ. హిందీ ‘మేరీ కోమ్’ వంటి సినిమా చేయాలనుంది.
► ఇంటెలిజెంట్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న మహేశ్‌బాబు–మురుగదాస్ సిన్మాలో నాది ఫన్నీ క్యారెక్టర్. నాగచైతన్య–కల్యాణ్‌కృష్ణ సినిమాలో సంప్రదాయబద్దమైన అమ్మాయి పాత్రలో నటిస్తున్నాను. ‘జబ్ వుయ్ మెట్’లో కరీనా కపూర్ పాత్ర కన్నా ఇందులో నా పాత్ర బాగుంటుంది. తమిళంలో కార్తీతో ఓ సినిమా చేస్తున్నా.