శ్రీను వైట్ల దర్శకత్వంలో..?
రామ్‌చరణ్-శ్రీను వైట్ల కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనుందా? ఫిలింనగర్ వర్గాలు అవుననే అంటున్నాయి. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు చరణ్. ఇక మహేశ్ ‘ఆగడు’తో శ్రీను వైట్ల క్షణం తీరిక లేకుండా ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక రామ్‌చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో సినిమా మొదలవుతుందని విశ్వసనీయ సమాచారం.
‘వెంకీ’ సినిమా చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యి... తనకు తానుగా శ్రీనువైట్లకు అవకాశం ఇచ్చారు చిరంజీవి. అదే ‘అందరివాడు’. కానీ... ఆ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అందుకే... చరణ్‌తో ఓ బ్లాక్‌బస్టర్ ఇచ్చి, మెగా అభిమానులకు కానుకగా ఇవ్వాలని భావిస్తున్నారట శ్రీనువైట్ల. ఆగస్ట్ కల్లా ‘ఆగడు’ చిత్రీకరణ పూర్తవుతుంది. ఆ తర్వాత ఈ చిత్రం ఉంటుందట. ఓ ప్రముఖ నిర్మాత నిర్మించే ఈ సినిమాకి సంబంధించిన మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.