
ఒకవైపు స్వారీ.. మరోవైపు ఫైట్!
పాత్ర డిమాండ్ చేసిన మేరకు స్టార్స్ తమ శరీరాకృతినీ, శారీరక భాషనూ మార్చుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే బరువు పెరగడం, తగ్గడం కోసం ఫిజికల్ వర్కవుట్స్ చేస్తుంటారు. కత్తిసాము, గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు రామ్‌చరణ్ అలాంటి పని మీదే ఉన్నారు. తమిళ చిత్రం ‘తని ఒరువన్’ తెలుగు రీమేక్ ‘ధ్రువ’లో ఆయన నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.
ఈ పాత్ర కోసం కసరత్తులు చేస్తున్నా రు. ప్రస్తుతం వెయిట్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సైక్లింగ్ చేస్తున్నారు. అలాగే గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు. ఆల్రెడీ చరణ్‌కి గుర్రపు స్వారీ తెలుసు కదా..మళ్లీ ఎందుకు నేర్చుకుంటున్నట్లు అనుకుంటున్నారా? ఈ చిత్రంలో గుర్రపు స్వారీ చేస్తూ, ఫైట్ చేసే సీన్స్ ఉన్నాయట. దాని కోసం శిక్షణ తీసుకుంటున్నారు. ఇది ఆషామాషీ ట్రైనింగ్ కాదని రామ్‌చరణ్ సన్నిహితులు పేర్కొన్నారు. అయినప్పటికీ చరణ్ వెనకాడకుండా శిక్షణ తీసుకుంటున్నాడని తెలిపారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది.