
తల్లి సూర్యవతితో రామ్‌గోపాల్‌వర్మ
► మదర్స్ డే సందర్భంగా మీ అబ్బాయి గురించి షేర్ చేసుకోండి..
సూర్యవతి: మనసులో ఉన్నది చెప్పేస్తాను. పక్షపాతం, అమ్మ ప్రేమలాగా కాకుండా ఇన్ని సంవత్సరాలు తనని చూసి చెబుతున్నాను. వర్మలాంటి గొప్ప వ్యక్తికి మదర్ అయినందుకు నాకు గర్వం గా ఉంది. అతని నేచర్ వల్ల. మూడేళ్ల వయసులో ఏ మాట అన్నాడో ఇప్పుడే అదే అంటున్నాడు. అప్పుడు సరిగ్గా గుర్తించలేదు. చిన్నప్పటి నుంచి ఫుడ్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. 5–6 సంవత్సరాలు పాలు తాగే ఉన్నాడు. చీమని తొక్కితే కూడా ఇష్టపడేవాడు కాదు. అవసరం లేకుండా ఎందుకు తొక్కడం అని అంటాడు.
► అంటే వర్మకు నాన్ వెజ్ అలవాటు లేదా?
చికెన్ తింటాడు. అలవాటు అయింది కాబట్టి. కానీ అనవసరంగా దోమను చంపడం ఎందుకు? అంటాడు.
► వర్మ చూడటానికి ఇంటిలిజెంట్‌లా కనిపిస్తారు. చిన్నప్పుడు కూడా ఇలానే ఉండేవారా?
వర్మ ఏకసంతాగ్రహి. ఒక్కసారి విన్నా కూడా గుర్తుపెట్టుకుంటాడు.
► ఒక గొప్ప వ్యక్తికి మదర్ అయినందుకు గర్వంగా ఉంది అన్నారు. వర్మలో గొప్పతనం ఏంటి?మంచి డైరెక్టర్ అనా ? వ్యక్తిగానా ?
డైరెక్టర్‌గా కాదు. వ్యక్తిగా, అతని స్వభావం వల్ల. మాట్లాడే తీరు వల్ల.
► వర్మ గారు ఉమెన్ గురించి మాట్లాడే విధానాన్ని చాలామంది క్రిటిసైజ్ చేస్తారు. అలాంటప్పుడు మీకెలా అనిపిస్తుంది?
లోపల తనేంటో నాకు బాగా తెలుసు. వివేకానండుడిని ఎందుకు ఇష్టపడతాం? తన స్వభావం వల్ల. వర్మ స్వభావం ఏంటో నాకు తెలుసు కాబట్టి తనంటే నాకు బాగా ఇçష్టం. వర్మ ఏది చేస్తాడో అదే చెప్తాడు. చెప్పని విషయాలు చేయడు. చిన్నప్పుడే ఒక యోగిలాగా ఉండేవాడు.
► పిల్లలు నార్మల్‌గా ఉంటేనే తల్లిదండ్రులకు బావుంటుంది. యోగిలా ఉన్నాడని భయం అనిపించేదా?
చాలా టెన్షన్ పడ్డాను. ఈ పిల్లవాడు ఏంటీ ఇలా ఉన్నాడూ అని. స్కూల్‌కి వెళ్లడం ఇష్టముండేది కాదు. అమ్మా నాన్నల మనస్సు కష్టపెట్టుకూడదని వెళ్లేవాడు. మార్కులు చాలా బాగా వచ్చేవి. నైన్త్ క్లాస్ ఆ టైమ్‌కి వచ్చేసరికి క్వార్టర్లీ ఎగ్జామ్స్‌లో 30 మార్కులు వస్తే హాఫ్ ఇయర్లీలో 90 మార్క్ వచ్చేవి. ఎందుకూ? అని అడిగితే నాకు రాయాలి అనిపించలేదు అనేవాడు.
► మరి సిస్టర్‌తో ఎలా ఉండేవాడు.
నేనూ, తన సిస్టర్ అంటే వర్మకు ప్రాణం. అసలు అరవడం లాంటివి ఏమీ చేయడం. పని వాళ్ల మీద కూడా కేకలు పెట్టడు. చాలా సాఫ్ట్. మృదుస్వభావి. ఇష్టం లేకపోతే కూర్చోబెట్టి చెబుతాడు. అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చెబుతాడు. అప్పటికీ వినకపోతే పట్టించుకోడు. మనల్ని పూర్తిగా కట్ చేస్తాడు. పనివాళ్లనైనా అంతే ఇంట్లో వాళ్లని అయినా అంతే.
► ఆయన మాటల తీరుని చూస్తే సెంటిమెంట్స్ లేని వ్యక్తిగా కనిపిస్తారు. మిమ్మల్ని ఎలా చూసుకుంటారు?
నా వయసు 76. నేను చాలా మందిని చూశాను. పొద్దునే లేవగానే అమ్మను చూడటం, వాళ్లకు దండం పెట్టడం లాంటివి చేస్తుంటారు. నా కొడుకు అలాంటివి ఏమీ చేయడు. నేనంటే తనకు బోలెడంత ప్రేమ. తన కళ్లలో చూపిస్తాడు. వాడు ఎక్కడున్నా వాడి మనసులో నేనుంటాను. వెరీ వెరీ హ్యాపీ. మనల్ని ప్రేమించే వ్యక్తి మనసులో మనం ఉన్నాం అంటే ఎంత దూరంలో ఉన్నా కుడా ఆ దూరం తెలియదు.
► అమ్మాయిల మీద కామెంట్ చేస్తుంటారు వర్మ. మీరెప్పుడైనా నీకూ సిస్టర్ ఉంది. ఇలా కామెంట్ చేయోద్దు అని చెబుతుంటారా?
ఎప్పుడూ చెప్పలేదు. తనని నేను పూర్తిగా అర్థం చేసుకోలేదని చెప్పలేదు. నాకు ఇప్పుడు అర్థం అవుతోంది. తను ఒక యోగిలా ఉంటాడు. ఒక పరిపూర్ణమైన మనిషిలా. అన్నీ లెవెల్స్ దాటిన మనిషి అన్నీ ఒకేలా మాట్లాడగలడు. ఒక లెసన్‌లా ఉంటుంది వర్మ మాట్లాడుతుంటే. ఒక పరిపూర్ణమైన మనిషి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మళ్లీ అదే విషయాన్ని ఇంకొకరు చెబితే అంత బాగా అనిపించదు.
► మీ అబ్బాయి మాట్లాడే మాటలు లెసన్ అంటారా?
లెసన్ అనను. పరిపూర్ణమైన మనిషి. ఆ మనిషి ఆ మాట మాట్లాడాడు అంటే ఆ విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకొని మాట్లాడుతున్నాడని అర్థం.
– డి.జి.భవాని
Comments
Please login to add a commentAdd a comment