ఫిల్మ్ ఛాంబర్ కి వర్మ బహిరంగ లేఖ | Ram Gopal Varma Open letter to film chamber | Sakshi
Sakshi News home page

ఫిల్మ్ ఛాంబర్ కి వర్మ బహిరంగ లేఖ

Published Mon, Aug 7 2017 3:10 PM | Last Updated on Fri, May 25 2018 2:11 PM

ఫిల్మ్ ఛాంబర్ కి వర్మ బహిరంగ లేఖ - Sakshi

ఫిల్మ్ ఛాంబర్ కి వర్మ బహిరంగ లేఖ

ఇటీవల డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఫిలిం ఛాంబర్ ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వానికి క్షమాపణ చెప్పిన విదానాన్ని ఆయన తప్పుపట్టారు.  ఫిల్మ్ ఛాంబర్ కి నా బహిరంగ లేఖ అంటూ సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. ' సినీ పరిశ్రమ నిజంగా సిగ్గు పడాల్సిన విషయం, డ్రగ్ స్కాండల్ కాదు..ఆ డ్రగ్ స్కాండల్ కి సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ ఒక బహిరంగలేఖతో తెలుగు సినీ పరిశ్రమకు తలవంపులు తెచ్చే విధంగా  అవసరం లేని క్షమాపణ చెప్పి ప్రాధేయపడిన విధానం

ఫిల్మ్ ఛాంబర్ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే నోటీసులు అందుకుని విచారణకి హాజరైన వారిలో ఏ ఒక్కరూ కూడా తాము తప్పు చేసామని బహిరంగంగా చెప్పడం కానీ, వారిలో ఫలానా వారి తప్పు నిరూపించబడింది అని అధికారులు  చెప్పడం గాని ఇంతవరకు జరగలేదు. ఈ రెండూ జరగనప్పుడు ఏ కారణానికి అపాలజీ చెప్పినట్టు? అపాలజీ లెటర్ లో ఒక వాక్యం "అతికొద్దిమంది చేసిన పొరపాట్లకి ఒక పరిశ్రమ తలవంచుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరం"- ఏమిటిది? ఎవరు చెప్పారు మీకు ఎవరు పొరపాట్లు చేసారో?

అసలు వాళ్లు చేసిన నేరమేమిటో, దానికి సంబంధించిన ఆధారాలు ఏమిటో కూడా చెప్పకుండా వాళ్లు అప్పుడే ఏదో మహా నేరం చేసినట్టు కలర్ ఇచ్చిన అధికారులపై ఆగ్రహించాల్సింది పోయి ఆల్రెడీ నేరం ఋజువైందనే ధోరణిలో క్షమాపణలేఖ పంపించడంలో అర్థం ఏమిటి?

అలాగే నోటీసులు అందుకున్న వారికి నా విన్నపం "మీలో ఏ మాత్రం పౌరుషం ఉన్నా, మీ పైన వచ్చిన ఆరోపణల మూలాన మీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పడిన మానసికవేదనపై మీరు ఏ మాత్రం నైతిక బాధ్యత ఫీల్ అవుతున్నా,జరిగిన ఆరోపణలపై నోరు విప్పి మీరు కూడా బహిరంగ లేఖలు రాయాలి. విషయం కోర్టులో ఉంటే మాట్లాడకూడదనే ఆలోచన సరైనది కావచ్చేమో కానీ, అసలు చార్జెస్ కూడా ఫైల్ అవ్వని ఇలాంటి సందర్భంలో నిజం మాట్లాడే హక్కు రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికీ వుంది. ఒకవేళ అలా మాట్లాడడం వల్ల చెయ్యని తప్పులని నిజం చేసి, అన్యాయంగా కేసులు బనాయించి చట్టం చట్రంలో మరింత బలంగా బిగిస్తారేమో అనే భయంతో మాట్లాడలేకపోతే అంతకు మించిన పిరికితనం మరొకటి ఉండదు. అది ప్రజాస్వామ్యానికే అవమానం".

అలాగే రేపు ఫైనల్ గా ఈ కేసులో వీళ్ల తప్పు లేదని తెలిస్తే ఛాంబర్ కి ఏ మాత్రం విచక్షణ వున్నా అధికారులకి బహిరంగ క్షమాపణలేఖ రాసినట్టే  ఆరోపణలు ఎదుర్కున్న వాళ్లందరికీ బహిరంగ లేఖ ద్వారా క్షమాపణ  చెప్పాలి. ఇలా చెయ్యని పక్షంలో భావి చరిత్రలో వీళ్లందరూ నిజంగా నేరస్థులేనని... కాని ఫిల్మ్ ఛాంబర్ చెప్పిన క్షమాపణ మూలానే క్షమించి వదిలేసారనే అబద్ధం నిజంగా నిలిచిపోతుంది..ఆ అబద్ధం నిజం కాకుండా చూడాల్సిన నైతిక బాధ్యత ఫిల్మ్ ఛాంబర్ కి ఉందని గౌరవపూర్వకంగా తెలియచేసుకుంటున్నాను.' అంటూ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు వర్మ.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement