
సాక్షి, తిరుమల: స్వర్గలోకంలో ఉన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, దివంగత సీఎం నందమూరి తారక రామారావు ఆశీస్సులు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకే ఉంటాయని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. నిజాలు నిరూపించగలిగే రూపంలో ఈ సినిమా ఉండబోతోందని స్పష్టం చేశారు. తిరపతిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి, చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి, జీవీ ఫిలిమ్స్ బ్యానర్ అధినేత బాలగిరి, చిత్ర యూనిట్‌తో కలిసి హాజరైన ఆయన అనంతరం సినిమాకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా’ అంటూ మొదలెట్టిన వర్మ, సినిమాపై ఆసక్తి రేపేలా పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
‘ఎన్టీఆర్ ఫోటోలు పెట్టుకొని కొందరు ఓట్లు అడుగుతున్నారు. వారందరి అసలు నిజాలు ఈ సినిమాలో చూపిస్తా. ఎన్టీఆర్‌కు సంబంధించి విషయాలను తెలుసుకుంటున్న సమయంలో లక్ష్మీపార్వతి గురించి ఆయన చెప్పిన ఓ పాత వీడియోను చూశా. తిరుపతి వెంకన్నపై ఎన్టీఆర్‌కు ఎలాంటి నమ్మకం, ఎమోషన్స్ ఉన్నాయో లక్ష్మీపార్వతిపై కూడా అంతే ఉన్నాయి. ఆ మహా మనిషి చరిత్ర గురించి సినిమాను ఎవరైనా తీయవచ్చు కానీ అసలు నిజమైంది ఏదో ప్రజలే నిర్ణయిస్తారు. ఈ సినిమా నిజం కాబట్టి ఎన్టీఆర్ ఆశీస్సులు మా సినిమాకే ఉంటాయి. ఇక ఈ సినిమాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. అసలు రాజకీయం కోసం ఈ సినిమాను తీయటం లేదు. నిజం కోసమే తప్పా ఏ పార్టీ కోసం ఈ చిత్రం ఉండదు. ఈ సినిమాను జనవరి 24న రిలీజ్ చేస్తాం’ అంటూ వర్మ పేర్కొన్నారు.
20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా: లక్ష్మీ పార్వతి
తనకు జరిగిన అన్యాయంపై సినిమా రావడం ఆనందంగా ఉందని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ‘ఆ మహానుభావుడి అసలు చరిత్రను ఎవరూ బయటకి తీయడం లేదని బాధపడేదానిని. అసలు చరిత్ర తెలపాలని 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాను. చివరి రోజుల్లో ఆయనకు జరిగిన అన్యాయం, ముఖ్యంగా ఆరోజు జరిగిన అవమానం తెలుగు ప్రజలకు తెలిపేలా సినిమా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ తెలియదు. కానీ ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయం, ఆయన పడిన బాధను తెలపండి. ఎన్టీఆర్ ఆస్తులను ఆయన కొడుకులు తీసుకున్నారు. కానీ నేను ఆయన నుంచి పోరాట స్పూర్తిని తీసుకున్నాను’ అంటూ లక్ష్మీ పార్వతి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment