వర్మ, నానా పటేకర్, తనుశ్రీ
ముంబై : ప్రస్తుతం దేశంలో చర్చనీయాంశమైన మీటూ ఉద్యమంపై వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. బాలీవుడ్ నటుడు నానా పటెకర్‌పై నటి తనుశ్రీ దత్తా చేసి ఆరోపణలను ఆయన తప్పుబట్టారు. నానా పటేకర్ షార్ట్ టెంపర్ వ్యక్తి అని కానీ ఒకరిని వేధించాడంటే మాత్రం తను నమ్మనని యూట్యూబ్‌లో ఓ వీడియో ద్వారా స్పష్టం చేశాడు.
వీడియోలో ఇంకా ఏమన్నాడంటే.. ‘సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు అన్నవి వాస్తవమే. తనుశ్రీ దత్తా సహా పలువురు నటీమణులు ముందుకొచ్చి క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై మాట్లాడటం అభినందనీయం. తనుశ్రీ దత్తా-నానాపటేకర్ వ్యవహారంలో వాస్తవంగా ఏం జరిగిందో నాకు తెలియదు. నానా పటేకర్తో చాలాకాలం కలిసి పనిచేశాను. ఆయన షార్ట్ టెంపర్ వ్యక్తి. కానీ నాకు తెలిసి నానా పటేకర్ వ్యక్తిగతంగా ఒకరిని వేధించే వ్యక్తి కాదు. ముంబైకి వెళ్లిన తొలి రోజుల్లో నేను ఓసారి నానాపటేకర్ కు ఫోన్ చేశాను. సాధారణంగా ఎవరైనా ఫోన్ చేస్తే మనం వెంటనే హలో అంటాం. కానీ ఆయన మాత్రం చెప్పు (బోల్) అని ప్రారంభించారు.
సార్ నా పేరు రామ్ గోపాల్ వర్మ. సినిమా డైరెక్టర్ ను. హైదరాబాద్ నుంచి మిమ్మల్ని కలవడానికి వచ్చానని చెప్పాను. వెంటనే ఇంటికి వచ్చేయ్ అన్నారు. నేను కథ చెబుతుండగా టీ తాగుతావా?అని ఆయన అడిగారు. తాగుతానని చెగానే కిచెన్ చూపించి ఆయనకు కూడా తీసుకురమ్మన్నారు. నాకు టీ చేయడం రాదని చెప్పగానే, ఇంత వయసు వచ్చింది.. ఇంకా టీ చేయడం రాకపోవడం ఏంటి? అని మీ అమ్మకు ఫోన్ కలుపు అని బెదిరించారు. నా తల్లితోనూ ఫోన్ లో మాట్లాడారు. నానాపటేకర్‌ను అర్థం చేసుకుంటే ఆయన్ని అందరూ గౌరవిస్తారు. తనకు తెలిసి నానాపటేకర్ జీవితంలో ఎన్నడూ లైంగిక వేధింపులకు పాల్పడరు. ఆయన గురించి పూర్తిగా తెలియని వ్యక్తులే నానా ప్రవర్తనను పొరపాటుగా అర్థం చేసుకుని ఉండవచ్చు.’ అని వర్మ చెప్పుకొచ్చాడు.
ఇక పదేళ్ల క్రితం ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా సమయంలో నానా తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ తనుశ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆయనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు తమకు జరిగిన చేదు అనుభవాలను సైతం పంచుకుంటున్నారు. దీంతో భారత్‌లో మీటూ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment