వర్మ ట్విటర్ కూతలు!
తమలోని భావాలను పంచుకోవడానికి సెలబ్రిటీలు, సినిమా తారలు గతంలో వార్తా పత్రికలను, సినీ వార పత్రికలను ఆశ్రయించాల్సి వచ్చేది. రోజులు మారాయి.. టెక్నాలజీ సాధించిన అభివృద్ధితో టార్గెట్ ఆడియెన్స్ ను చేరుకోవడం చాలా సులభమైంది. ఇంటర్నెట్ సృష్టిస్తున్న ప్రభంజనంతో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. ఇతరులకు నచ్చినా.. నచ్చకపోయినా.. తాము చెప్పాల్సింది.. ఫేస్ బుక్ లోనో, ట్విటర్ లోనో లేదా తమ స్వంత బ్లాగ్, వెబ్ సైట్లలో తమ పని కానిచ్చిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ భావాలను చెప్పుకోవడానికి సెన్సార్ అవసరమే లేదు. వివాదాలు సృష్టించాలన్నా.. తమ అనుభవాలను పంచుకోవాలన్నా.. సోషల్ మీడియా అండగా ఉంటుంది. సోషల్ మీడియా ఆసరాతో రామ్ గోపాల్ వర్మ, అక్కినేని నాగార్జున, రాజమౌళి, ఇంకా ఎందరో ప్రముఖులు సామాన్య ప్రజలకు దగ్గరవుతున్నారు.
వాడుకోవడం అంటే ఇదా అని ఆశ్చర్యపోయే రీతిలో ట్విటర్ వాడకాన్ని రాంగోపాల్ వర్మ చూపిస్తున్నాడు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఆసరాతో పలు రకాలు కామెంట్లతో వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావాలంటూ ట్విటర్ లో ప్రచారం మొదలు పెట్టాడు. ఆ సంగతి అలా ఉంటే.. ఉత్తర ప్రదేశ్ లో ఉన్నవ్ లో పసిడి తవ్వకాలపై గమ్మత్తైన వ్యాఖ్యలు వర్మ చేశారు.
సాధువుల మాటలు నమ్మి తవ్వకాలు చేపట్టిన భారత అర్కియాలజిస్ట్ లు ఇడియెట్స్ అంటూ పోస్ట్ చేశాడు. అంతేకాక నిధుల తవ్వకం సంఘటనతో పోల్చుకుంటే తాను రూపొందించిన షోలే రీమేక్ ఆగ్ సూపర్ హిట్ అని ట్వీట్ చేశాడు. అమెరికాతో పోల్చుకుంటే భారత్ వంద రెట్టు ఇడియెట్ అని.. లేని సంపద కోసం భారత్, ఇరాక్ లో లేని అణ్వాస్త్రాల కోసం అమెరికా తవ్వకాలు చేపట్టాయని మరో ట్విట్ చేశారు. ప్రచారం కోసం సాధువులు చేపట్టిన ఈ ఫీట్ వల్ల తనకు బ్రాండ్ న్యూ విజువల్స్ లభిస్తాయి తప్ప మరోకటి ఉండదని సందేశాన్ని పోస్ట్ చేశారు. ఆశారాం బాపు, గోల్డ్ సాధు వల్ల భారత్ కు మంచి సంపదను, అందగత్తెలను పట్టుకుని అవకాశం భారత్ కు లభించింది అంటూ మరో వ్యాఖ్య వర్మ ట్విటర్ పేజ్ పై దర్శనమిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ కోసం ప్రజలు ఎంతగా ఇష్టపడుతున్నారో అనేక రుజువులు కళ్లముందు కదలాడుతున్నాయి. ఐనా ప్రజల కోసం సంసిద్ధుడై రాజకీయ పార్టీని ప్రారంభించక పోతే ఓ పెద్ద ఇడియెట్ గా మిగిలిపోతాడని వ్యాఖ్యానించారు.
గత 40 సంవత్సరాల్లో చిరంజీవి సంపాదించుకున్నమెగాస్టార్ హోదాను పవన్ కళ్యాణ్ అధిగమించాడని, పవన్ కళ్యాణ్ కు మెగాస్టార్ లాంటి బిరుదులు చాలా తక్కువ హోదా అని.. పవర్ స్టార్ అనే హోదాని సునామీ స్టార్ అని మార్చుకోవాలని సూచించారు. అంతేకాకుండా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం తన జీవిత కాలంలో సాధించే కలెక్షన్లు అత్తారింటికి దారేది మూడు రోజులు వసూలు చేసిన కలెక్షన్లతో సమానం...ప్రపంచంలో చాలా చోట్ల చెన్నై ఎక్స్ ప్రెస్ సృష్టించిన రికార్టులను అత్తారింటికి దారేది చిత్రం అధిగమించింది అని సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ట్వీట్ చేశాడు.
ఎలాంటి మీడియానైనా ఉపయోగించుకునే విధానం రాంగోపాల్ వర్మకు తెలిసినంతగా మరెవరికి తెలియదు నిస్సందేహంగా చెప్పవచ్చు. వినోదం, వివాదస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియా వెబ్ సైట్లతో అభిమానులకు దగ్గరవ్వడమే కాక నిత్యం వార్తల్లో నిలువడానిక ప్రయత్నించడం కొందర్ని హర్ట్ చేసినా.. మరి కొందరికి ఆనందాన్ని మిగిలుస్తోంది. అయితే సినిమాలతో ఆకట్టుకోలేక పోతున్న వర్మ కనీసం సోషల్ మీడియా ద్వారా హల్ చల్ సృష్టిస్తున్నారంటూ మరో వర్గం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.