
మళ్లీ కాలేజీ...క్లాసులు!?
బుద్ధిగా చదువుకుందామని కొందరు, బుట్టలో అమ్మాయిని పడేయొచ్చని కొందరు కాలేజీకి వెళ్తుంటారు.
బుద్ధిగా చదువుకుందామని కొందరు, బుట్టలో అమ్మాయిని పడేయొచ్చని కొందరు కాలేజీకి వెళ్తుంటారు. మరి, రామ్ ఎందుకు కాలేజీకి వెళ్తున్నాడనేది సస్పెన్స్! హీరోగా మంచి స్థాయిలో ఉన్నాడు కదా! చదువు కోసమైనా, అమ్మాయి కోసమైనా... మళ్లీ కాలేజీ, క్లాసులు ఎందుకు? అనుకోవద్దు! ఓ సినిమా కోసమే అతను కాలేజీకి వెళ్తున్నాడు.
రామ్ హీరోగా ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్, పీఆర్ సినిమాస్ సంస్థలు ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మూడో షెడ్యూల్‌లో కేజీ రెడ్డి కాలేజీ, సంజీవయ్య పార్క్, అంబేద్కర్ యూనివర్శిటీల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ నెలాఖరున విశాఖ, అరుకు లోయల్లో మరో షెడ్యూల్ ఉంటుందని చిత్రనిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ తెలిపారు. అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాశ్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సమర్పణ: కృష్ణచైతన్య.
మూడు కోట్లమంది చూశారు: రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ‘నేను శైలజ’ సినిమా మంచి హిట్టయ్యింది. గతేడాది వచ్చిన ఈ సినిమాతో పాటు పాటలు కూడా సూపర్ హిట్టే. అందుకు ఉదాహరణ ‘క్రేజీ క్రేజీ ఫీలింగ్’ పాట. యూట్యూబ్‌లో ఇప్పటివరకు ఈ పాటను మూడు కోట్లమంది వీక్షించారు. దీనిపై చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది.