‘రామ్‌లీలా’కు గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: బాలీవుడ్ సినిమా రాంలీలా విడుదలకు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శృంగారం, హింస, అసభ్యత ఎక్కువగా ఉన్న ఆ సినిమాపై నిషేధం విధించాలని రాష్ట్రవాది శివసేన అనే స్వచ్ఛంద సేవా సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఆ సినిమా హిందువుల మత మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని ఆ సంస్థ చేసిన వాదనతో ఏకీభవించలేదు.
సంజమ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటించిన రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనేల మధ్య కళాత్మకత అనేది ఏమీ కనపడటం లేదన్న రాష్ర్టవాది శివసేనకు రూ.50,000 జరిమానాకు కూడా విధించింది. దేవుడి రామ పేరును ఈ సినిమా టైటిల్‌గా పెట్టడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్రవాది శివసేన అధ్యక్షుడు జై భగవాన్ గోయల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ, జస్టిన్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం తోసిపుచ్చింది.
రామ్ పేరు పెట్టుకోవద్దని మీరు మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారా అని ప్రశ్నించింది. ఢిల్లీ న్యాయసేవల విభాగానికి కొంత డబ్బును డిపాజిట్ చేయాలని సూచించింది. వచ్చే నెల 15న విడుదలకు సిద్ధమవుతున్న రామ్‌లీలా పురాణ శాస్త్రాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉందని సదరు ఎన్‌జీవో పిల్‌లో పేర్కొంది. పురాణంతో ఎలాంటి సంబంధం లేకుండా తీసిన సినిమాకు రామ్‌లీలా అని పెట్టారని పేర్కొంది. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని వ్యాఖ్యానించింది. ఇందులో శృంగారం, హింస, అసభ్యత ఎక్కువగా ఉందని, కావున ఈ సినిమా విడుదలను ఆపాలని వాదించింది.