నా వల్ల ఇతర నాయికలు లాభపడుతున్నారు
Published Fri, Nov 22 2013 1:23 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
‘‘అప్పుడప్పుడు నేను తీసుకునే నిర్ణయాలకు నాలో నేనే నవ్వుకుంటాను. మనకేమైనా పిచ్చా లేక ఏదైనా ప్రాబ్లమా అని కూడా అనుకుంటాను’’ అంటున్నారు కరీనాకపూర్. ఈ అందగత్తె ఇలా తనపై తనే జోక్స్ వేసుకోవడానికి కారణం ఉంది. తన ఇంటివరకూ వచ్చిన అద్భుతమైన అవకాశాల్లో కొన్నింటిని చేతులారా వదులుకున్నారు కరీనా. వాటిల్లో ఇటీవల విడుదలైన ‘రామ్‌లీలా’ ఒకటి. ఈ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి విజయవంతమైన చిత్రాలను వదులుకున్నప్పుడు కరీనా పై విధంగా అనుకుంటుంటారట. అలాగే మరో రకంగా కూడా అనుకుంటారామె. దాని గురించి కరీనా చెబుతూ -‘‘బంగారంలాంటి అవకాశాలను వదులుకున్నప్పుడు నేనేమాత్రం ఫీలవ్వను.
ఎందుకంటే, జీవితం అప్పుడే అయిపోలేదుగా. అలాంటి అవకాశాలు భవిష్యత్తులో బోల్డన్ని వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే.. నేను వదులుకోవడం ద్వారా ఆ అవకాశాలను వేరే కథానాయికకు ఇస్తున్నాను. ఆ విధంగా వాళ్లు లాభపడుతున్నారు. ‘రామ్‌లీలా’ నేను వద్దనుకున్న తర్వాతే వేరే తారకు వెళ్లింది. సో... నాకు రావాల్సిన విజయం తనకు దక్కింది. కాబట్టి, నాకు ఆనందంగానే ఉంది’’ అని చెప్పారు. ఈ మాటలు విన్నవాళ్లు కరీనా ఓవర్‌గా మాట్లాడుతోందని అంటున్నారు. తనేదో ఉదారస్వభావంతో ఇతర నాయికలకు అవకాశం ఇచ్చినట్లుగా కరీనా మాట్లాడటంపట్ల కొంతమంది నాయికలు గరమ్ గరమ్‌గా ఉన్నారట. వారిలో దీపికా కూడా ఉన్నారని సమాచారం. సందర్భం చూసి, కరీనాకి దీపికా సమాధానం చెబుతుందని, ఆ సమయం త్వరగా వస్తే బాగుండునని ఔత్సాహికరాయుళ్లు ఎదురుచూస్తున్నారు.
Advertisement
Advertisement