రామయ్యా వస్తావయ్యా ఆడియో ఆవిష్కరణ | Ramayya Vasthavayya Audio Launch | Sakshi
Sakshi News home page

రామయ్యా వస్తావయ్యా ఆడియో ఆవిష్కరణ

Published Sun, Sep 22 2013 12:47 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

రామయ్యా వస్తావయ్యా  ఆడియో ఆవిష్కరణ - Sakshi

రామయ్యా వస్తావయ్యా ఆడియో ఆవిష్కరణ

‘‘మామూలుగా నాకు అభిమానుల మధ్య సందడిగా ఆడియో వేడుకలు చేసుకోవడం ఇష్టం. అయితే ఆ మధ్య జరిగిన ఓ అవాంఛనీయ సంఘటన వల్ల ఈ వేడుకను నిరాడంబరంగా ప్లాన్ చేశాం. అంతకు మించి వేరే కారణాలేవీ లేవు’’ అన్నారు ఎన్టీఆర్. హరీష్‌శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్, సమంత, శ్రుతిహాసన్ కాంబినేషన్‌లో ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రం ‘రామయ్యా వస్తావయ్యా’. తమన్ పాటలు స్వరపరిచారు. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం పాటల సీడీని వీవీ వినాయక్ ఆవిష్కరించి, రాజమౌళికి ఇచ్చారు.
 
 ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ -‘‘నేను చిన్న వయసులో తొడగొట్టగలనని ‘ఆది’తో, కామెడీ చేయగలనని ‘అదుర్స్’తో వినాయక్, గొడ్డలి పట్టుకోగలనని, ‘సింహాద్రి’తో రాజమౌళి, ఎమోషనల్‌గా చేయగలనని ‘రాఖీ’తో కృష్ణవంశీ, స్టయిల్‌గా కనిపించగలనని ‘బృందావనం’తో వంశీ పైడిపల్లి.. ఇలా ఒక్కో దర్శకుడు నాలోని ఒక్కో కోణాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు నేను యూత్‌ఫుల్‌గా చేయగలనని, హీరోయిన్ వెనకాల పడి టీజ్ చేయగలనని హరీష్ నిరూపించాడు’’ అని చెప్పారు.
 
 ‘దిల్’ రాజు మాట్లాడుతూ -‘‘ఈ చిత్రంలో కొత్త ఎన్టీఆర్ కనిపిస్తాడు. మా సంస్థలో ఇదొక ట్రెండ్‌సెట్టర్ మూవీ అవుతుంది’’ అన్నారు.  హరీష్‌శంకర్ మాట్లాడుతూ -‘‘రాజుగారి బేనర్లో సినిమా చేయాలనే కల ప్రతి దర్శకుడికీ ఉంటుంది. ఆ కల నెరవేరినందుకు ఆనందంగా ఉంది. ఎన్టీఆర్ వయసులో మాత్రమే చిన్నవాడు. ఈ సినిమాకి తనతో కలిసి 100 రోజులు పనిచేశాను. ఆ అనుభవంతో చెబుతున్నా... డైలాగ్ చెప్పాలన్నా, డాన్స్ చేయాలన్నా, పంచ్ కొట్టాలన్నా... అది ఎన్టీఆర్‌కే సాధ్యం. 
 
మళ్లీ ఇలాంటి హీరో తెలుగు ఇండస్ట్రీలో పుడతాడా?
 అనిపించింది. ఎంత క్లిష్టమైన సన్నివేశాన్నయినా సింగిల్ టేక్‌లో చేసేస్తాడు. అలాంటి హీరోతో పని చేసినందుకు గర్వంగా ఉంది’’ అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో తమన్, వంశీ పైడిపల్లి, చోటా కె.నాయుడు, కొరటాల శివ, కోట శ్రీనివాసరావు, గణేష్, గోపీచంద్ మలినేని, శిరీష్, లక్ష్మణ్, హంసానందిని, ఆదిత్య మ్యూజిక్ ఉమేష్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement