Ramayya Vasthavayya
-
పాత్ర నచ్చితే అతిథిగా కూడా చేస్తా : శ్రుతిహాసన్
‘‘కథలో ప్రాధాన్యత ఉంటే... మంచి గుర్తింపు లభిస్తుందని నాకు నమ్మకం కుదిరితే... అయిదు నిమిషాల ప్రత్యేక పాత్రలో నటించడానికి కూడా నేను రెడీ’’ అంటున్నారు శ్రుతిహాసన్. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రుతి మాట్లాడుతూ ‘‘కథ, పాత్రే నాకు ముఖ్యం. అందుకే అతిథి పాత్రలు చేయడానికి కూడా నిశ్చయించుకున్నాను’’ అన్నారు. ప్రస్తుతం తెలుగు నేర్చుకునే పనిలో ఉన్నానని, త్వరలోనే డబ్బింగ్ కూడా చెప్పుకుంటానని శ్రుతిహాసన్ అన్నారు. ‘రామయ్యా వస్తావయ్యా’లో అమ్ములు పాత్ర ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిందని శ్రుతి ఆనందం వ్యక్తం చేశారు. ద్వితీయార్ధం కథను మలుపుతిప్పే పాత్ర కావడం వల్లే ఈ పాత్ర చేయడానికి అంగీకరించానని శ్రుతి తెలిపారు. ఎన్టీఆర్ మంచి డాన్సర్ అని కొనియాడారు. ఎన్టీఆర్‌తో కలిసి నటించడం పట్ల శ్రుతి ఆనందం వ్యక్తం చేశారు. -
'రామయ్యా వస్తావయ్యా' తొలిరోజు షేర్ రూ. 8.7 కోట్లు
జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'రామయ్యా వస్తావయ్యా' సినిమాపై భిన్నమైన టాక్ వచ్చినా ఆశించిన స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మొదటి రోజు 8.7 కోట్లు వసూలు చేసింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 40 కోట్ల రూపాయల వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. సమంత, శృతిహాసన్ హీరోయిన్లు కాగా హరీష్ శంకర్ దర్శకుడు. 'రామయ్యా వస్తావయ్యా సినిమాపై మిశ్రమ స్పందన వచ్చినా ఆంధ్రప్రదేశ్‌లో మంచి వసూళ్లు రాబట్టింది. తొలి రోజే భారీ మొత్తం వచ్చింది. అయితే తర్వాతి రోజు నుంచి వసూళ్లు తగ్గాయి. తొలి వారం కలెక్షన్లను బట్టి బాక్సాఫీసు వద్ద ఈ సినిమా సత్తా ఎంత అన్న విషయం తేలనుంది' అని సినీ విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు. -
'రామయ్యా'కు ఉద్యమ సెగ తప్పదా?
తెలంగాణ నోట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత సీమాంధ్ర ప్రాంతంలో పరిస్థితులు చేజారి పోయాయి. సీమాంధ్రలో ఉద్యమాల కారణంగా విద్యుత్, రవాణాతోపాటు ఇతర రంగాల్లో కూడా సంక్షోభాలు నెలకొన్నాయి. గత 70 రోజులుగా సీమాంధ్రలో ఉద్యమ ప్రబావం ఉవ్వెత్తున్న ఉన్న కారణంగా టాలీవుడ్ లో నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన భారీ బడ్జెట్, అగ్ర నటుల చిత్రాలు వాయిదా పడ్డాయి. సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితుల కారణంగా వాయిదాకు నోచుకోని అత్తారింటికి దారేది? చిత్రం లీక్ అయిందన్న వార్తలతో కొంత సానుభూతిని మూటకట్టుకొని ఉద్యమ సెగను దాటేసి.. ప్రేక్షకుల వద్దకు చేరుకుంది. అయితే అత్తారింటికి దారేది విడుదలకు పెద్దగా ప్రతిఘటన లేకపోవడంతో మిగితా భారీ బడ్జెట్ చిత్రాలు రామయ్యా వస్తావయ్యా.. ఎవడు చిత్రాలకు పెద్దగా అడ్డంకులు ఉండవని చిత్ర పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అయితే ఊహించని రీతీలో తెలంగాణపై కేంద్రం అడ్డగోలు నిర్ణయం తీసుకోవడంతో పరిస్థితిలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ నేపథ్యలో అక్టోబర్ 10 తేదిన విడదలయ్యే రామయ్యా వస్తావయ్యా చిత్ర విడుదలపై మళ్లీ సందేహాలు నెలకొన్నాయి. ప్రస్తుత పరిస్థితులను బేరిజు వేసుకున్న చిత్ర నిర్మాత దిల్ రాజు.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన రామయ్యా వస్తావయ్యా చిత్రాన్ని దసరా పండగకు విడుదల చేయాలనే భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతి దసరా పండుగ మాదిరిగానే బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని నిర్మాత దిల్ రాజు పరీక్షించుకునేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం. గతంలో దసరా పండగ సందర్భంగా దిల్ రాజు విడుదల చేసిన కొత్త బంగారు లోకం (2008), బృందావనం (2010) చిత్రాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ.. ప్రతి దసరా పండగ మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తనకు భారీ విజయం దక్కబోతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు చిత్రాల విడుదలకు అనుకూలంగా లేదనది వాస్తవమే. అయితే సీమాంధ్రలో నెలకొన్న ఉద్యమ ప్రభావాన్ని తట్టుకుని రామయ్యా వస్తావయ్యా చిత్రం విడుదల సాధ్యమేనా.. ఒకవేళ నిర్మాతలు విడుదల చేయాలనే నిర్ణయంతో ముందుకు వెళితే.. ఆ చిత్ర ప్రదర్శన సజావుగా సాగుతుందా అనే ప్రశ్నలు పరిశ్రమలో తెలెత్తుతున్నాయి. ఉద్యమ సెగను తట్టుకుని ఏ విధంగా అడ్డంకులను ఎదుర్కొని రామయ్యా వస్తావయ్యా విడుదలవుతుందో వేచి చూడాల్సిందే! -
శృతిహాసన్ లేడీ విలన్ కాదట
జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'రామయ్యా వస్తావయా' సినిమాలో శృతిహాసన్ నెగిటివ్ పాత్ర పోషించలేదని దర్శకుడు హరీష్ శంకర్ స్పష్టం చేశారు. ఆమె అతిథి పాత్రలో మాత్రమే కనిపిస్తుందని చెప్పారు. ఈ సినిమాలో శృతి నెగిటివ్ పాత్రలో నటించిందని వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. రామయ్యా వస్తావయాలో శృతి ప్రత్యేక పాత్ర పోషించిందని హరీష్ తెలిపారు. ఆయన దర్శకత్వంలోనే వచ్చిన పవన్ కల్యాణ్ సూపర్ హిట్ సినిమా గబ్బర్ సింగ్లోనూ కమల్ తనయ నటించింది. తాజా చిత్రంలో ఎన్టీఆర్ సరసన కనిపించనుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా మరో హీరోయిన్ సమంత నటించింది. నిర్మాత దిల్ రాజు. ఈ నెల 10న సినిమా విడుదల కానుంది. కాగా శృతిహాసన్.. రామ్ చరణ్ సరసన నటించిన 'ఎవడు' సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ రెండు సినిమాల కోసం శృతి ఆసక్తిగా ఎదురుచూస్తోంది. -
రామయ్య... దసరాకి వస్తాడయ్య...
‘‘ఈ ఏడాది సంక్రాంతికి మల్టీస్టారర్ చిత్రం ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ని ప్రేక్షకులకు అందించాను. ఈ దసరాకి ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రాన్ని అందించనున్నాను. ఇంకా ఈ ఏడాది రెండు పెద్ద పండగలున్నాయి. రైట్ రిలీజ్ కోసం చూసి, ఈ సంవత్సరమే ‘ఎవడు’ కూడా రిలీజ్ చేసేస్తా. ఒకే ఏడాది నలుగురు అగ్రహీరోల సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఘనత సొంతం చేసుకున్నాను. ఓ విధంగా 80 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఈ క్రెడిట్ దక్కింది నాకే అనుకుంటా’’ అని దిల్ రాజు అన్నారు. ఎన్టీఆర్ కథానాయకునిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రం దసరా కానుకగా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిల్ రాజు మాట్లాడారు. ‘‘దసరా కానుకగా మా సంస్థ నుంచి వచ్చిన సినిమాలు కొత్తబంగారు లోకం, బృందావనం. రెండూ మంచి విజయాన్ని సాధించాయి. ఈ సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుందని నా నమ్మకం. ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోతో రెండో సారి సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం ప్రచార చిత్రాల్లో ఎన్టీఆర్ లుక్‌కి ప్రపంచ వ్యాప్తంగా స్పందన లభిస్తోంది. రవితేజకు ‘మిరపకాయ్’, పవన్‌కల్యాణ్‌కి ‘గబ్బర్‌సింగ్’ లాంటి విజయాలనిచ్చిన హరీష్ తప్పకుండా ఎన్టీఆర్‌కి కూడా ఆ స్థాయి విజయాన్ని ఇస్తాడని నా నమ్మకం. ఫ్యామిలీ ఎమోషన్‌తో కూడిన ఎంటర్టైనర్ ఇది. ఈ వారంలో సెన్సార్ కూడా పూర్తవుతుంది. తప్పకుండా విజయం సాధిస్తుందని నా నమ్మకం’’ అని చెప్పారు. ‘‘క్లారిటీ ఉన్న నిర్మాత దిల్‌రాజు. మేకింగ్ అంటే ఏంటో పక్కన కూర్చోబెట్టి చూపించాడు తను. ఆయన సంస్థ విలువ పెంచేలా ఈ సినిమా ఉంటుంది. ఇందులో ఎన్టీఆర్ చాలా ఫ్రెష్‌గా ఉంటాడు. ఎన్ని అంచనాలైనా పెట్టుకొని రండి. అన్ని అంచనాలనూ అధిగమిస్తామనే నమ్మకం ఉంది. ఈ సినిమా అనుకున్నప్పుడే బ్రహ్మానందంగారికి ఓ పాత్ర అనుకున్నాం. కానీ స్క్రీన్‌ప్లేలో కుదర్లేదు. అందుకే ఆయన్ను మిస్ అయ్యామనే బాధ ఉంది. అలాగే... అందరూ శ్రుతి హాసన్ లాయర్ అట కదా, డాక్టర్ అట కదా అని ప్రశ్నలు సంధిస్తున్నారు. నాకు, తనకూ ఉన్న ర్యాపో కారణంగా.. నాపై గౌరవంతో ఓ ప్రత్యేక పాత్రలో నటించింది తను. అదేంటో రేపు తెరపై చూస్తారు’’ అన్నారు హరీష్‌శంకర్. ఇంకా రమేష్‌రెడ్డి, సతీష్ వేగేశ్న, బ్రహ్మ కడలి కూడా మాట్లాడారు. -
తారక్ ఇప్పుడు బాహుబలి
బరువు తగ్గి శరీరాన్ని శిల్పంగా మార్చుకోవడమంటే.. కఠోర శ్రమతో కూడుకున్న వ్యవహారం. అంత శ్రమనీ ఓర్చి బొద్దుగా ఉండే తారక్ కాస్తా... స్లిమ్‌గా మారి పరిశ్రమ మొత్తం విస్తుపోయేలా చేశారు. చాలామందికి ఈ విషయంలో ఆయన స్ఫూర్తిగా కూడా నిలిచారు. అయితే... తారక్ ఇప్పుడు ఊహకందని మరో ఫీట్ చేశారు. ప్రస్తుతం ఉన్న తన బరువు కంటే... రెండు రెట్లు బరువును మోయగల బాహుబలశాలిగా మారారు తారక్. ఆయన ఇంత బలవంతునిగా మారడం వెనుక అకుంఠిత దీక్ష, పట్టుదల ఉన్నాయంటున్నారు తారక్ పర్సనల్ ఫిజికల్ ట్రైనర్స్ ఎంబర్, జాన్ షుమెట్. వీరిద్దరూ ఎనిమిది నెలల క్రితం తారక్ కోసం ప్రత్యేకంగా అమెరికా నుంచి వచ్చారు. ఈ ఎనిమిది నెలల్లో శారీరకంగా తారక్‌లో ఎన్నో మార్పులొచ్చాయని, తన బరువు కంటే రెండు రెట్లు బరువును ఆయన అవలీలగా మోయగలరని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ప్రస్తుతం తారక్ శరీరంలో కొవ్వు శాతం పూర్తిగా తగ్గిపోయిందని, కేవలం ఎనిమిది నెలల్లో ఆయన సాధించిన ఘనత ఇదని ఎంబర్, జాన్ షుమెట్ తెలిపారు. ‘రామయ్యా వస్తావయ్యా’లో ఆరు పలకల దేహంతో తారక్ కనిపించనున్నారని సమాచారం. -
అమ్ములుగా శ్రుతిహాసన్
కొన్ని పాత్రలు నటీనటుల జీవి తాన్నే మార్చేస్తాయి. ‘గబ్బర్‌సింగ్’లో శ్రుతిహాసన్ పోషించిన భాగ్యలక్ష్మి పాత్ర లాగా. ఆ పాత్ర శ్రుతికి నిజంగానే భాగ్యాన్ని తెచ్చిపెట్టింది. ‘గబ్బర్‌సింగ్’ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది ఈ ముద్దుగుమ్మకు. విరివిగా సినిమాలు చేస్తూ టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా అవతరించారు శ్రుతి. ఇదిలావుంటే... ఎన్టీఆర్‌కి జోడీగా ఆమె నటించిన ‘రామయ్యా వస్తావయ్య’ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చాలా ఉద్వేగంతో ఉన్నారు శ్రుతి. కారణం ఆ సినిమాలో తను పోషించిన ‘అమ్ములు’ పాత్ర. జీవితాలను మలుపుతిప్పే పాత్రలు అరుదుగా మాత్రమే వస్తుంటాయి. నాకు వెంటవెంటనే వస్తున్నాయి. అంటూ ఇటీవల మీడియా ముందు ఆనందాన్ని వ్యక్తం చేశారు శ్రుతి. ‘‘‘గబ్బర్‌సింగ్’లోని భాగ్యలక్ష్మి పాత్రతో నేను తెలుగమ్మాయిని అయిపోయాను. ఇక్కడ అందరూ సొంత అమ్మాయిలా చూసుకుంటున్నారు. త్వరలో రాబోతున్న ‘రామయ్యా వస్తావయ్య’లో అంతకంటే గొప్ప పాత్ర చేశాను. ఇందులో నా పాత్ర పేరు ‘అమ్ములు’. అచ్చతెనుగు అమ్మాయి పాత్ర అన్నమాట. ‘గబ్బర్‌సింగ్’లో సెలైంట్‌గా కనిపించిన నేను, ఇందులో చలాకీగా మురిపిస్తా. ఈ సందర్భంలో నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది హరీష్శంకర్కే. రెండు మంచి పాత్రలిచ్చి నా కెరీర్‌నే మార్చేశారాయన’’ అన్నారు. -
‘రామయ్యా వస్తావయ్యా’ మూవీ స్టిల్స్
ఎన్టీఆర్. హరీష్‌శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్, సమంత, శ్రుతిహాసన్ కాంబినేషన్లో ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రం ‘రామయ్యా వస్తావయ్యా’. తమన్ పాటలు స్వరపరిచారు. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం పాటల సీడీని వీవీ వినాయక్ ఆవిష్కరించి, రాజమౌళికి ఇచ్చారు. -
రామయ్యా వస్తావయ్యా ఆడియో ఆవిష్కరణ
‘‘మామూలుగా నాకు అభిమానుల మధ్య సందడిగా ఆడియో వేడుకలు చేసుకోవడం ఇష్టం. అయితే ఆ మధ్య జరిగిన ఓ అవాంఛనీయ సంఘటన వల్ల ఈ వేడుకను నిరాడంబరంగా ప్లాన్ చేశాం. అంతకు మించి వేరే కారణాలేవీ లేవు’’ అన్నారు ఎన్టీఆర్. హరీష్‌శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్, సమంత, శ్రుతిహాసన్ కాంబినేషన్లో ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రం ‘రామయ్యా వస్తావయ్యా’. తమన్ పాటలు స్వరపరిచారు. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం పాటల సీడీని వీవీ వినాయక్ ఆవిష్కరించి, రాజమౌళికి ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ -‘‘నేను చిన్న వయసులో తొడగొట్టగలనని ‘ఆది’తో, కామెడీ చేయగలనని ‘అదుర్స్’తో వినాయక్, గొడ్డలి పట్టుకోగలనని, ‘సింహాద్రి’తో రాజమౌళి, ఎమోషనల్‌గా చేయగలనని ‘రాఖీ’తో కృష్ణవంశీ, స్టయిల్‌గా కనిపించగలనని ‘బృందావనం’తో వంశీ పైడిపల్లి.. ఇలా ఒక్కో దర్శకుడు నాలోని ఒక్కో కోణాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు నేను యూత్‌ఫుల్‌గా చేయగలనని, హీరోయిన్ వెనకాల పడి టీజ్ చేయగలనని హరీష్ నిరూపించాడు’’ అని చెప్పారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ -‘‘ఈ చిత్రంలో కొత్త ఎన్టీఆర్ కనిపిస్తాడు. మా సంస్థలో ఇదొక ట్రెండ్‌సెట్టర్ మూవీ అవుతుంది’’ అన్నారు. హరీష్‌శంకర్ మాట్లాడుతూ -‘‘రాజుగారి బేనర్లో సినిమా చేయాలనే కల ప్రతి దర్శకుడికీ ఉంటుంది. ఆ కల నెరవేరినందుకు ఆనందంగా ఉంది. ఎన్టీఆర్ వయసులో మాత్రమే చిన్నవాడు. ఈ సినిమాకి తనతో కలిసి 100 రోజులు పనిచేశాను. ఆ అనుభవంతో చెబుతున్నా... డైలాగ్ చెప్పాలన్నా, డాన్స్ చేయాలన్నా, పంచ్ కొట్టాలన్నా... అది ఎన్టీఆర్కే సాధ్యం. మళ్లీ ఇలాంటి హీరో తెలుగు ఇండస్ట్రీలో పుడతాడా? అనిపించింది. ఎంత క్లిష్టమైన సన్నివేశాన్నయినా సింగిల్ టేక్‌లో చేసేస్తాడు. అలాంటి హీరోతో పని చేసినందుకు గర్వంగా ఉంది’’ అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో తమన్, వంశీ పైడిపల్లి, చోటా కె.నాయుడు, కొరటాల శివ, కోట శ్రీనివాసరావు, గణేష్, గోపీచంద్ మలినేని, శిరీష్, లక్ష్మణ్, హంసానందిని, ఆదిత్య మ్యూజిక్ ఉమేష్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
ఒక్క రోజు వ్యవధిలో రెండు భారీ చిత్రాలు
విడుదల తేదీలు ఓ కొలిక్కి వచ్చాయి. ఎన్నో అంచనాలతో భారీ ఎత్తున తయారవుతోన్న ‘అత్తారింటికి దారేది’, ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రాలు అక్టోబర్‌లో ఒక్క రోజు వ్యవధిలో విడుదల కానున్నాయి. ‘అత్తారింటికి దారేది’అక్టోబర్ 9న విడుదల కాబోతుండగా, ‘రామయ్యా వస్తావయ్యా’ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జల్సా’ తర్వాత పవన్‌కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన ‘అత్తారింటికి దారేది’ పాటలు ఇప్పటికే మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇక పవన్‌కల్యాణ్ పాడిన ‘కాటమరాయుడా’ పాట యూట్యూబ్‌లో ఆల్‌టైమ్ రికార్డులు సృష్టిం చింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించారు. సమంత, ప్రణీత ఇందులో కథానాయికలు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఇక ‘రామయ్యా వస్తావయ్యా’ విషయానికొస్తే... ‘గబ్బర్‌సింగ్’ తర్వాత హరీష్ శంకర్ చేస్తున్న సినిమా ఇది. ఎన్టీఆర్ ఇందులో సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ‘బుడ్డోడా బుడ్డోడా అంటే గుడ్డలూడదీసి కొడతా’ అనే టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు అంబరాన్నంటాయి. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. పాటలు ఈ వారంలో విడుదల కానున్నాయి. సమంత, శ్రుతిహాసన్ కథానాయికలు. ‘బృందావనం’తో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన ఎన్టీఆర్, ఈ సినిమాతో యువతకు మరింత చేరువవుతారని నిర్మాత ‘దిల్’రాజు చెబుతున్నారు. -
స్పెయిన్‌లో రామయ్య డ్యూయెట్స్
కెరీర్ ప్రారంభంలో రొమాంటిక్ సినిమాలు చేయడం... ఏజీ ఇమేజీ పెరిగాక అప్పుడు మాస్ సినిమాలు చేయడం హీరోలకు పరిపాటి. కానీ ఎన్టీఆర్ అందుకు భిన్నం. కెరీర్ ప్రారంభంలోనే చిరంజీవి, బాలకృష్ణ చేసినంత మాస్ సినిమాలు చేసేశారాయన. ఇప్పుడేమో... రొమాంటిక్ యాంగిల్లో కనిపించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. స్లిమ్ అయ్యాక ఆయనలో వచ్చిన మార్పు ఇది. ‘బృందావనం’, త్వరలో రాబోతున్న ‘రామయ్యా వస్తావయ్యా’ ఆ కోవకు చెందిన సినిమాలే. ఈ నెల 26న పాటల చిత్రీకరణకు ఈ చిత్రం యూనిట్ స్పెయిన్ వెళుతోంది. అక్కడ ఎన్టీఆర్-శ్రుతిహాసన్‌తో ఓ పాట, ఎన్టీఆర్-సమంతతో ఓ పాట చిత్రీకరించనున్నారు. ఈ రెండూ మంచి రొమాంటిక్ డ్యూయేట్లే కావడం విశేషం. యువతను ఉర్రూతలూగించేలా ఈ పాటలు ఉంటాయని యూనిట్ వర్గాలు అంటున్నాయి. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వకుండా లావిష్‌గా నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని, గతంలో ఎన్టీఆర్‌తో ఆయన నిర్మించిన ‘బృందావనం’ సినిమాను మించేలా ఈ సినిమా ఉంటుందని యూనిట్ సభ్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు కూడా. ఇందులో ఎన్టీఆర్ విద్యార్థి నాయకునిగా కనిపిస్తాడు. ఓ వైపు రొమాంటిగ్గా, మరోవైపు శక్తిమంతంగా ఆయన పాత్ర సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ అభినయిస్తున్న తీరును అభినందిస్తూ... దర్శకుడు హరీష్‌శంకర్ ట్విట్టర్లో ఓ మెసేజ్ పోస్ట్ చేశారు. ‘‘నాట్యమైనా, నటనైనా, సంభాషణలు పలికే తీరైనా... ఏదైనా.. ఎన్టీఆర్‌కి కరతలామలకం. నిజానికి కెమెరా ముందు అతను పెట్టే ఎఫర్ తక్కువ. కానీ తెరపై మాత్రం అది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దటీజ్ ఎన్టీఆర్’’ అనేది ఆ మెసేజ్ సారాంశం. దీన్ని బట్టి... ఇందులో ఎన్టీఆర్ నటన ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వచ్చే నెల 10కల్లా ఈ చిత్రం షూటింగ్ పూర్తవుతుందని యూనిట్ వర్గాల భోగట్టా.