రామయ్య... దసరాకి వస్తాడయ్య...
రామయ్య... దసరాకి వస్తాడయ్య...
Published Tue, Oct 1 2013 2:16 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
‘‘ఈ ఏడాది సంక్రాంతికి మల్టీస్టారర్ చిత్రం ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ని ప్రేక్షకులకు అందించాను. ఈ దసరాకి ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రాన్ని అందించనున్నాను. ఇంకా ఈ ఏడాది రెండు పెద్ద పండగలున్నాయి. రైట్ రిలీజ్ కోసం చూసి, ఈ సంవత్సరమే ‘ఎవడు’ కూడా రిలీజ్ చేసేస్తా. ఒకే ఏడాది నలుగురు అగ్రహీరోల సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఘనత సొంతం చేసుకున్నాను. ఓ విధంగా 80 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఈ క్రెడిట్ దక్కింది నాకే అనుకుంటా’’ అని దిల్ రాజు అన్నారు.
ఎన్టీఆర్ కథానాయకునిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రం దసరా కానుకగా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిల్ రాజు మాట్లాడారు. ‘‘దసరా కానుకగా మా సంస్థ నుంచి వచ్చిన సినిమాలు కొత్తబంగారు లోకం, బృందావనం. రెండూ మంచి విజయాన్ని సాధించాయి. ఈ సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుందని నా నమ్మకం. ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోతో రెండో సారి సినిమా చేయడం ఆనందంగా ఉంది.
ఈ చిత్రం ప్రచార చిత్రాల్లో ఎన్టీఆర్ లుక్‌కి ప్రపంచ వ్యాప్తంగా స్పందన లభిస్తోంది. రవితేజకు ‘మిరపకాయ్’, పవన్‌కల్యాణ్‌కి ‘గబ్బర్‌సింగ్’ లాంటి విజయాలనిచ్చిన హరీష్ తప్పకుండా ఎన్టీఆర్‌కి కూడా ఆ స్థాయి విజయాన్ని ఇస్తాడని నా నమ్మకం. ఫ్యామిలీ ఎమోషన్‌తో కూడిన ఎంటర్‌టైనర్ ఇది. ఈ వారంలో సెన్సార్ కూడా పూర్తవుతుంది. తప్పకుండా విజయం సాధిస్తుందని నా నమ్మకం’’ అని చెప్పారు. ‘‘క్లారిటీ ఉన్న నిర్మాత దిల్‌రాజు. మేకింగ్ అంటే ఏంటో పక్కన కూర్చోబెట్టి చూపించాడు తను. ఆయన సంస్థ విలువ పెంచేలా ఈ సినిమా ఉంటుంది. ఇందులో ఎన్టీఆర్ చాలా ఫ్రెష్‌గా ఉంటాడు.
ఎన్ని అంచనాలైనా పెట్టుకొని రండి. అన్ని అంచనాలనూ అధిగమిస్తామనే నమ్మకం ఉంది. ఈ సినిమా అనుకున్నప్పుడే బ్రహ్మానందంగారికి ఓ పాత్ర అనుకున్నాం. కానీ స్క్రీన్‌ప్లేలో కుదర్లేదు. అందుకే ఆయన్ను మిస్ అయ్యామనే బాధ ఉంది. అలాగే... అందరూ శ్రుతి హాసన్ లాయర్ అట కదా, డాక్టర్ అట కదా అని ప్రశ్నలు సంధిస్తున్నారు. నాకు, తనకూ ఉన్న ర్యాపో కారణంగా.. నాపై గౌరవంతో ఓ ప్రత్యేక పాత్రలో నటించింది తను. అదేంటో రేపు తెరపై చూస్తారు’’ అన్నారు హరీష్‌శంకర్. ఇంకా రమేష్‌రెడ్డి, సతీష్ వేగేశ్న, బ్రహ్మ కడలి కూడా మాట్లాడారు.
Advertisement
Advertisement