'రామయ్యా'కు ఉద్యమ సెగ తప్పదా?
'రామయ్యా'కు ఉద్యమ సెగ తప్పదా?
Published Mon, Oct 7 2013 12:56 PM | Last Updated on Sun, Jul 14 2019 4:54 PM
తెలంగాణ నోట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత సీమాంధ్ర ప్రాంతంలో పరిస్థితులు చేజారి పోయాయి. సీమాంధ్రలో ఉద్యమాల కారణంగా విద్యుత్, రవాణాతోపాటు ఇతర రంగాల్లో కూడా సంక్షోభాలు నెలకొన్నాయి. గత 70 రోజులుగా సీమాంధ్రలో ఉద్యమ ప్రబావం ఉవ్వెత్తున్న ఉన్న కారణంగా టాలీవుడ్ లో నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన భారీ బడ్జెట్, అగ్ర నటుల చిత్రాలు వాయిదా పడ్డాయి.
సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితుల కారణంగా వాయిదాకు నోచుకోని అత్తారింటికి దారేది? చిత్రం లీక్ అయిందన్న వార్తలతో కొంత సానుభూతిని మూటకట్టుకొని ఉద్యమ సెగను దాటేసి.. ప్రేక్షకుల వద్దకు చేరుకుంది. అయితే అత్తారింటికి దారేది విడుదలకు పెద్దగా ప్రతిఘటన లేకపోవడంతో మిగితా భారీ బడ్జెట్ చిత్రాలు రామయ్యా వస్తావయ్యా.. ఎవడు చిత్రాలకు పెద్దగా అడ్డంకులు ఉండవని చిత్ర పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అయితే ఊహించని రీతీలో తెలంగాణపై కేంద్రం అడ్డగోలు నిర్ణయం తీసుకోవడంతో పరిస్థితిలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ నేపథ్యలో అక్టోబర్ 10 తేదిన విడదలయ్యే రామయ్యా వస్తావయ్యా చిత్ర విడుదలపై మళ్లీ సందేహాలు నెలకొన్నాయి.
ప్రస్తుత పరిస్థితులను బేరిజు వేసుకున్న చిత్ర నిర్మాత దిల్ రాజు.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన రామయ్యా వస్తావయ్యా చిత్రాన్ని దసరా పండగకు విడుదల చేయాలనే భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతి దసరా పండుగ మాదిరిగానే బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని నిర్మాత దిల్ రాజు పరీక్షించుకునేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం. గతంలో దసరా పండగ సందర్భంగా దిల్ రాజు విడుదల చేసిన కొత్త బంగారు లోకం (2008), బృందావనం (2010) చిత్రాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ.. ప్రతి దసరా పండగ మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తనకు భారీ విజయం దక్కబోతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
అయితే రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు చిత్రాల విడుదలకు అనుకూలంగా లేదనది వాస్తవమే. అయితే సీమాంధ్రలో నెలకొన్న ఉద్యమ ప్రభావాన్ని తట్టుకుని రామయ్యా వస్తావయ్యా చిత్రం విడుదల సాధ్యమేనా.. ఒకవేళ నిర్మాతలు విడుదల చేయాలనే నిర్ణయంతో ముందుకు వెళితే.. ఆ చిత్ర ప్రదర్శన సజావుగా సాగుతుందా అనే ప్రశ్నలు పరిశ్రమలో తెలెత్తుతున్నాయి. ఉద్యమ సెగను తట్టుకుని ఏ విధంగా అడ్డంకులను ఎదుర్కొని రామయ్యా వస్తావయ్యా విడుదలవుతుందో వేచి చూడాల్సిందే!
Advertisement
Advertisement