
ఊరు హోరేత్తేలా తప్పెట మోత మోగుతుంది. గుండెలు ఝల్లుమనేలా గజ్జెలు గల్లు గల్లుమంటున్నాయి. అక్కడికి చిట్టిబాబు ఎంట్రీ ఇచ్చాడు. ఆ నెక్ట్స్ ఏంటి?... అంటే ప్రస్తుతానికి ఇంతే. బ్యాలెన్స్ వెండితెరపై చూస్తే ఫ్యాన్స్ ఈల కొట్టి గోల పెట్టడం ఖాయం అంటున్నారు ‘రంగస్థలం’ చిత్రబృందం. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. లేటెస్ట్ షెడ్యూల్ మంగళవారం మొదలైంది. కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్స్‌లో తప్పెట డ్యానర్స్ పాల్గొంటున్నారు.
‘‘రంగస్థలం’ సెట్‌లో మళ్లీ ఫోక్ ఆర్ట్స్ గురించి తెలుసుకుంటున్నాను. మా సినిమాలోని తప్పెట డ్యాన్సర్స్‌ను మీట్ అవ్వండి’’ అని మీరు చూస్తున్న ఫొటోను రామ్‌చరణ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ‘‘సినిమాలోని కీలకమైన సన్నివేశాల కోసం తప్పెట ఆటగాళ్లను వెస్ట్ గోదావరి నుంచి పిలిపించాం. కథలో కీలకమైన ఎపిసోడ్‌లో ఈ సీన్స్ ఉంటాయి. ఈ షెడ్యూల్ నెలాఖరు వరకు సాగుతుంది’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇందులో రామ్‌చరణ్ పాత్ర పేరు చిట్టిబాబు అని తెలిసిందే. మార్చి 30న చిత్రం విడుదల కానుంది.