సాక్షి, హైదరాబాద్ : కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించడంతో దాదాపు అన్ని వ్యాపార కార్యక్రమాలు మూతపడ్డాయి. దీంతో ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి. వీటిలో మద్యం షాపుల మూత అనేది పెద్ద ఎత్తున ఆదాయాన్ని స్తంభింపజేసింది. కేవలం దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా వైన్ షాపులు మూతపటడంతో ఆయా ప్రభుత్వాల ఆదాయానికి గండిపడింది. ముఖ్యంగా భారత్‌లో లిక్కర్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున రెవెన్యూ అందుతోంది.
ఈ క్రమంలో మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడం కోసం మద్యం దుకాణాలకు ఆంక్షల నుంచి సడలింపు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. నిషేధం పూర్తిగా ఎత్తివేయకుండా ఆర్థిక నష్టాన్ని పూడ్చుకునేందుకు పరిమితులతో కూడిన వెసులుబాటును ఇవ్వాలని ప్రభుత్వాలకు పలువురు సూచనలు సైతం ఇస్తున్నారు. అలాగే బార్ షాపులు తెరిస్తే ఆహార పదార్థాల విక్రయం ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తాజాగా దీనిపై టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. మద్యం అందుబాటులో లేకపోతే బ్లాక్ మార్కెట్ ద్వారా జరిగే అనార్థాలపై ట్వీట్ చేశారు. ‘ప్రజలు కోరుకునే దేనినైనా పరిమితం చేయడం వల్ల బ్లాక్ మార్కెట్ ధరలను పెంచడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల తమకు అవసరమైన ఆల్కహాల్‌ను చాలా ఎక్కువ ధరకు కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున డబ్బును ఉపయోగిస్తారు. తద్వారా వారి కుటుంబాలు ఇతర అవసరాలను కోల్పోయే అవకాశం ఉంది’ అని ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment