విశ్వరూపం చూపిన రమ్యకృష్ణ
'బాహుబలి' సినిమా మొదటి సీన్ లో రమ్యకృష్ణ అద్భుతమైన ఎంట్రీ ఇచ్చారు. తర్వాత వాటర్ ఫాల్స్ నేపథ్యంలో ఆరడుగుల, ఆరు ప్యాక్ ల హీరో ప్రభాస్ శివుడిగా ఎంట్రీ ఘనంగా కనపడుతుంది. ఎవ్వడంట ఎవ్వడంట పాట. ఆ తర్వాత పాల జలపాతాల నేపథ్యంలో మిల్కీబ్యూటీ తమన్నా.. అవంతికగా దర్శనం ఇస్తుంది.
కట్టప్పగా సత్యరాజ్, అస్లాంఖాన్ పాత్రలో సుదీప్ ఎంట్రీలు కూడా స్క్రీన్ నిండుగా ఉంటాయి.. మాహిష్మతి రాజ్య వైభవం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. విలన్ పాత్రధారి రానాకు కూడా దర్శకుడు రాజమౌళి బుల్ ఫైట్ తో మంచి ఎంట్రీ ఇచ్చారు. ఇక దేవసేన పాత్రలో అనుష్క గురించి ఎంత చెప్పినా తక్కువే. సంకెళ్లు, చింపిరి జుట్టుతో ఆమె మేకప్ గుండెలను పిండేసేలా ఉంటుంది.
శివుడు, అవంతికల మధ్య రొమాన్స్ బాగా పండింది. అంతలోనే తన కార్యాన్ని పూర్తి చేస్తానని శివుడు అవంతికకు మాట ఇవ్వడం, అతడి జుట్టు ఎగురుతుండగా ఇంటర్వెల్ పడుతుంది.
సెకండాఫ్ లో శివగామిగా రమ్యకృష్ణ తన నటనా వైదుష్యాన్ని ప్రదర్శిస్తుంది. మమతల తల్లి పాట ఇక్కడే వస్తుంది. మనోహరి పాటలో నోరా ఫతేహి, స్కార్లెట్ విల్సన్ హొయలొలికించారు.
కాలకేయ యుద్ధానికి దారితీసే పరిస్థితులు, కుర్చీ కోసం కొట్లాటలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ ఆ తర్వాత వస్తాయి. కాలకేయ యుద్ధం సినిమా మొత్తానికి హైలైట్. వీఎఫ్ఎక్స్ వాళ్ల పనితనానికి ఇది మచ్చుతునక. అనుకున్న సమయం కంటే ఎందుకు ఎక్కువ పట్టిందనేది ఈ యుద్ధం చూస్తే అర్థమవుతుంది. సుదీర్ఘంగా సాగే ఈ యుద్ధంలో అనేక మలుపులు, ట్విస్టులు ఉంటాయి. యుద్ధం చివర్లో బిజ్జలదేవగా నాజర్, శివగామిగా రమ్యకృష్ణ నటనలో విశ్వరూపం చూపిస్తారు.